Sunday, April 28, 2024

AP: ఓడీఓపీ అవార్డు 2023​ పోటీ​​కి వెంకటగిరి చేనేత

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : ​150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వెంకటగిరి చేనేత కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహించే “ఒన్ ఇండియా ఒన్ ప్రోడక్ట్ (ఓడీఓపీ) అవార్డు 2023 ” కు పోటీపడుతోంది. ప్రతిష్టా​త్మకంగా జరిగే పోటీలో లభించే పురస్కారం ఆధారంగా వేంకటగిరి చేనేత ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం విస్తృతమవుతుంది. నిర్ణీత పద్దతిలో పోటీకి దరఖాస్తు చేసుకున్న వేంకటగిరి చేనేత ఓడీఓపీ అవార్డుకు అర్హతను పరిశీలించి నివేదిక ఇచ్చే నిమిత్తం ఈనెల 17వ తేదీన ఇన్వెస్ట్ ఇండియా టీం కమిటీ ప్రతినిధి బృం​దం జిల్లా పర్యటనకు రానున్నది.


దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ప్రత్యేకతగా నిలిచే వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితెచ్చి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగమైన డిపార్ట్ మెంట్ అఫ్ ప్రమోషన్ అఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ద్వారా ఓడీఓపీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం కింద వివిధ జిల్లాలకు చెందిన ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి, ప్రోత్సహించడం నుంచి గవర్నమెంట్ అఫ్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తరింపజేయడానికి సంబంధిత విభాగం కృషి చేయనున్నది. ఆయా జిల్లాల నుంచి తమ తమ ప్రత్యేకతలు తెలియచేస్తూ చేసే దరఖాస్తులను స్వీకరించి, నిపుణుల కమిటీలను ఆ జిల్లాలకు పంపించి, వాటి ప్రత్యేకతలను అధ్యయనం చేసి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సంకల్పించింది.

ఈ క్రమంలోనే ఓడీఓపీ అవార్డు 2023 ​కోసం ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి జులై 31వ తేదీ మధ్యకాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అధికారిక సమాచారం ప్రకారం దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల తరపున ఆయా జిల్లాల, రాష్ట్రాల అధికారుల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. అందులో తిరుపతి జిల్లాకు చెందిన సుదీర్ఘ చరిత్ర కలిగిన వేంకటగిరి చేనేత వస్త్ర నైపుణ్య ఉత్పాదనలు కూడా చోటుచేసుకున్నాయి.

- Advertisement -


వేంకటగిరి చేనేత ప్రతిభ – స్థితిగతి..
ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న వేంకటగిరి చేనేత వస్త్రాలను 1700 సంవత్సరంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశం పోషిస్తూ ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంచెలంచెలుగా నేసేవారిలో పెరుగుతూ వచ్చిన సృజనాత్మక క్రమంలో వెండి జరీ, ఆఫ్ ఫైన్ జరీ వంటి రకాలతో ప్రసిద్ధి చెందిన వేంకటగిరి చీరలు 150 సంవత్సరాలకు పైగా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలనే కాక విదేశీ పర్యాటకులను కూడా ఆకట్టుకుంటూ వస్తోంది. చీరకు రెండు వైపులా ఒకే డిజైన్ కనబడేలా నేసే జాందనీ వర్క్​ ఇక్కడి కార్మికుల నైపుణ్యానికి నిదర్శనం. ​వెంకటగిరి, పాటూరు, నెల్లూరు రూరల్ లోని పలు గ్రామాల్లో వేలాది కుటుంబాలు చేనేత పరిశ్రమలో రాణిస్తున్నాయి. ​​నేసేవారి నైపుణ్యానికి ​తోడ్పడే 22 ​ప్రాథమిక సంఘాల్లో 660 మంది సభ్యులు నిరంతర కృషి చేసి ఉత్పత్తులను ఓపెన్ మార్కెట్ కే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే చేనేత వస్త్ర ప్రదర్శనల్లో పాల్గొనడం, ఆప్కో వస్త్రాలయాల్లో అందుబాటులో వుంచడం, ఆన్ లైన్ అమ్మకా​లు చేయడం ద్వారా వేంకటగిరి చేనేత ప్రగతిని విస్తృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అనువంశికంగా వస్తున్న చేనేత నైపుణ్యాన్ని మెరుగులు దిద్దడానికి 1992లో భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం​లో​ 25ఎకరాల విస్తీర్ణం​లో ఏర్పాటైన ​ఎస్ పి కె ఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ​ సంస్థ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్ కమిషనర్​ నేతృత్వంలో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ టెక్నాలజీలో అనేక రకాల కోర్సులు అందిస్తూ, ఉపాధి ఉద్యోగాల కల్పన​కు తోడ్పడుతోంది. ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మగ్గంపై ఆధారపడి జీవించే కార్మికునికి నేతన్న నేస్తం పేరుతో ప్రతి ఏడాది మగ్గాల ఆధునీకరణకు గత అయిదేళ్లుగా అందిస్తున్న రూ.24వేల ఆర్ధిక సహాయం అందిస్తుండగా కేంద్ర ​ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ద్వారా చేనేత సహకార సంఘంలకు​,​ వ్యక్తిగత చేనేత కార్మికులకు అవసరమగు నూలు​ కానీ, పట్టు ​కానీ మిల్లు మిల్ గేటు ధరకే ​లభించేలా చేస్తోంది.


17న నిపుణుల కమిటీ రాక …​
​ఎంతో చారిత్రక ప్రత్యేకతలు కలిగిన వేంకటగిరి చేనేత ఉత్పత్తులు ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే ఓడీఓపీ 2023 అవార్డు కోసం పోటీ పడుతోంది. ఆ అవార్డుకు అర్హతా అనర్హతలను పరిశీలించే నిమిత్తం ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధి జిగీష తివారి నేతృత్వంలో ఒక నిపుణుల బృందం ఈనెల 17వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నది. ఆ పర్యటనలో భాగంగా ఆ బృందం సభ్యులు చేనేత కార్మికుల నైపుణ్య ఉత్పత్తులను పరిశీలించి, వివిధ పధకాల ద్వారా లబ్ది పొందిన చేనేత కార్మికులతో ముఖాముఖి చర్చించి, సాధించిన అభివృద్ధిని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి స్పందిస్తూ… ఘన చరిత్ర కలిగిన వేంకటగిరి చేనేత వస్త్రాల నైపుణ్యానికి ఓడీఓపీ 2023 అవార్డు లభించి సంబంధిత మార్కెటింగ్ మరింతగా విస్తరించడమే కాక జిల్లా ప్రతిష్ఠ కూడా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement