Friday, May 17, 2024

TRS: ఏపీలో కూడా పార్టీ పెట్టాలని అక్క‌డి ప్ర‌జ‌లు అడుగుతున్నారు : కేసీఆర్

ద‌ళితబంధును ఆపేది నవంబర్ 4 వరకేనని.. ఆ తర్వాత ఆ పథకాన్ని ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. డిసెంబర్ నాటికి హూజూరాబాద్ లో దళితబంధును 100శాతం అమలు చేస్తామన్నారు. దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయని.. ఆంధ్రలో కూడా పార్టీ పెట్టండి, గెలిపించుకుంటామని అంటున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు పక్క రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని తెలిపారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.

దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ప్రతిష్ట ఇనుమడిస్తోందని అన్నారు. సాహసం లేకపోతే దేన్నీ సాధించలేమని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాలని, కేసీఈర్ సభ పెట్టకూడదనే చిల్లర ప్రయత్నాలను మానుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్లీనరీలో చేస్తున్న ప్రసంగాన్ని హుజూరాబాద్ ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement