Friday, April 26, 2024

అడ్మిష‌న్లు పెంచుకునేందుకే ఈ తతంగం.. నారాయ‌ణ‌ను అరెస్టు చేశాం: చిత్తూరు ఎస్పీ

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయ‌ణ‌ను అరెస్ట్ చేశామ‌ని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న‌తో పాటు తిరుప‌తి డీన్‌ను కూడా అరెస్ట్ చేసిన‌ట్టు పేర్కొన్నారు. నారాయ‌ణ స్కూళ్ల‌ల్లో అడ్మిష‌న్ల‌ను పెంచేందుకే ఇలా పేప‌ర్‌ను లీక్ చేశార‌ని ఎస్పీ వెల్ల‌డించారు. మాజీ మంత్రి, నారాయ‌ణ సంస్థ‌ల అధిప‌తి నారాయ‌ణ‌ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. గ‌త నెల 27న టెన్త్ పేప‌ర్ మాల్ ప్రాక్టీస్ జ‌రిగింద‌ని, చిత్తూరు పీఎస్‌లో న‌మోదైన కేసులో అంత‌ర్భాగంగా నారాయ‌ణ అరెస్ట్ జ‌రిగింద‌ని ఎస్పీ వివ‌రించారు.

ముందుగానే మాట్లాడుకొని ప్ర‌శ్నాప‌త్రాన్ని లీక్ చేశార‌ని, స‌మాధానాలు రాసి, లోప‌లికి పంపే ప్ర‌య‌త్నాలు కూడా చేశార‌ని ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్కుల కోస‌మే ఈ మాల్ ప్రాక్టీసింగ్ చేశార‌ని ఎస్పీ వెల్ల‌డించారు. ఇన్విజ్ లేట‌ర్ల వివ‌రాలు ముందే తెలుసుకొని, మాల్ ప్రాక్టీస్ చేసేవారని తెలిపారు. అంతేకాకుండా వారి ద‌గ్గ‌ర చ‌దువుకునే విద్యార్థుల‌ను రెండు భాగాలుగా విభ‌జించి, ఏఏ విద్యార్థులు ఎక్క‌డెక్క‌డ ప‌రీక్ష రాస్తారో తెలుసుకుంటార‌ని అన్నారు. హెడ్ ఆఫీస్ నుంచే కీ త‌యారు చేసి విద్యార్థుల‌కు పంపుతార‌ని ఎస్పీ వెల్ల‌డించారు. యావ‌రేజ్ విద్యార్థుల సెంట‌ర్ల‌కు పేప‌ర్‌ను ముందుగానే అందించార‌ని, ఇన్విజ్‌లేట‌ర్స్‌ను మేనేజ్ చేసుకొని, ఇదంతా చేశార‌ని జిల్లా ఎస్పీ ప్ర‌కటించారు. ఇన్విజ్‌లేట‌ర్స్ ద్వారా క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఫొటో తీసి, బ‌య‌ట‌కు పంపేవార‌ని తెలిపారు. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏడుగురిని అరెస్ట్ చేశామ‌ని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement