Monday, May 20, 2024

కొఠియా గ్రామాలను వదులుకునేది లేదు..

సాలూరు, (ప్రభ న్యూస్‌) : తమ ప్రాణాలు పోయినా కొఠియా భూభాగాన్ని వదిలి పెట్టేది లేదని, ఈ విషయంలో అంతా కలిసికట్టుగా పోరాటం చెయ్యాలని, అవసరమైతే దేశ రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కలవాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఒడిశా నేతలు తీర్మానించారు. తొమ్మిదో తేదీన ఆంధ్రా, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌ లు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ లో సమావేశమై ఉభయ రాష్ట్రాల్ర మధ్య దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పలు సమస్యలపై చర్చలు జరిపారు. అందులో భాగంగా కొఠియా గ్రామాల వివాదంపై చర్చించి, వాటి పరిష్కారం నిమిత్తం ఉభయ రాష్ట్రాల్ర చీఫ్‌ సెక్రెటరీలు చర్చించే విధంగా కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

దీనితో ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాకి చెందిన , జైపూర్‌, నవరంగపూర్‌, పొట్టంగి ప్రాంతాలకు చెందిన బిజేడీ, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులతోపాటు పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొని కొఠియా గ్రామాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎంపి జయరాం పంగి అధ్యక్షతన కొరాపుట్‌ సర్క్యూట్‌ హౌస్‌ లో సమావేశం జరిగింది. ఈసందర్భంగా కొరాపుట్‌ ఎంపి సప్తగిరి శంకర్‌ ఉల్కా కాంగ్రెస్‌ తోపాటు కొరాపుట్‌, జైపూర్‌, పొట్టంగి ఎమ్మెల్యేలు రఘురాం పడాల్‌, తారా ప్రసాద్‌ బహిణి పొతి, ప్రీతం పాడి, పొట్టంగి మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్‌ పంగి, కొరాపుట్‌ బీజేడి అధ్యక్షులు ఈశ్వర్‌ పాణిగ్రహి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విద్యాధర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఆయా నాయకులు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల్ర తరపున ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీలతో కూడిన కమిటీలు జరిపే చర్చల్లో తమ వాదనలను వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వారి(ఒడిశా)ప్రభుత్వానికి లేఖ రాసేందుకు తీర్మానించారు. అదేవిధంగా అవసరాన్ని బట్టి రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ లను కలిసి సమస్యను వివరించేందుకు నిర్ణయించి తీర్మానించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement