Friday, May 10, 2024

ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనంపై రగడ కొనసాగుతోంది. ఇటీవల అనంతరపురంలో ఎయిడెడ్ విలీనంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేయడం.. వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం అంశంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అంతర్గత మెమో జారీ చేసింది.

ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు పునరాలోచనకి అవకాశం ఇచ్చింది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్‌ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించగా.. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని ప్రభుత్వం వెల్లడించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని ఉన్నత విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది.

ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆప్షన్ లు ఏంటంటే..

* మొదటి ఆప్షన్‌గా ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులతో సహా ఎయిడెడ్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులని, స్టాఫ్ ని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించడం

- Advertisement -

* రెండవ ఆప్షన్‌గా విద్యాసంస్థల ఆస్థులు కాకుండా కేవలం మంజూరు అయిన‌ ఉపాద్యాయ పోస్టులని, స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం

* మూడవ ఆప్షన్‌గా మొదటి రెండు ఆప్షన్‌లకు వ్యతిరేకంగా పూర్తిగా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం

* నాలుగవ ఆప్షన్‌గా మొదటి, రెండు ఆప్షన్‌లలో ఇప్పటికే ఎంచుకుని ప్రభుత్వానికి విలీనం చేయడానికి అంగీకరించిన విద్యాసంస్థలకి పునరాలోచన కల్పిస్తూ విలీనంపై అంగీకారానికి వెనక్కి తీసుకుని పూర్తిగా ఎయిడెడ్ విద్యాసంస్థగా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చింది.

కాగా, వీలైనంత త్వరగా ఎయిడెడ్ విలీన ప్రక్రియ ముగించడానికి పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, సాంకేతిక శాఖ, ఇంటర్ బోర్డులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో టీ.కాంగ్రెస్ నేతలు.. హైకమాండ్ చర్యలుంటాయా?

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement