Friday, May 3, 2024

Statue of Social Justice – సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ – జగన్

సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ, అంబేడ్కర్‌ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని వెల్లడించారు. ఇక స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకు వస్తుందన్నారు. ఈ విగ్రహం పేదల హక్కులకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. దళిత వర్గాలకు బలహీన వర్గాలకు అంబేడ్కర్ గొంతుకగా నిలిచారని.. మరణం లేని మహానేత అంబేడ్కర్ అంటూ వ్యాఖ్యానించారు.

అంటరానితనం తన రూపం మార్చుకుందని.. పేదలను దూరంగా ఉంచడం మాత్రమే అంటరానితనం కాదన్నారు. పేదవారు ఇంగ్లీష్‌ మీడియం చదవొద్దని కోరుకోవడం కూడా అంటరానితనమేనన్నారు. పేదలు తెలుగు మీడియంలోనే చదవాలనడం వివక్ష కాదా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలంట అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారు కోరుకుంటున్నారని.. పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమేనన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం వెల్లడించారు.

దళితులకు చంద్రబాబు సెంటు భూమి ఇవ్వలేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది లేదని.. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దళితులంటే చంద్రబాబుకు నచ్చరని ఆయన చెప్పారు. పెత్తందారి పార్టీలకు పెత్తందారి నేతలకు పేదలు పట్టరని విమర్శించారు. పేదలకు అండగా ఉండాలని పెత్తందారి పార్టీలకు ఎందుకు ఆలోచన రాదని ప్రశ్నించారు. “వైసీపీ నుంచి శాసనమండలిలో 29 మంది సభ్యులు బలహీనవర్గాల వారేనని.. 8 మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం ఎస్సీ, బీసీలే.. 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీనవర్గాల వారే.. ఇలాంటి సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో తప్పితే ఎక్కడైనా చూశారా?.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు.” అని జగన్‌ స్పష్టం చేశారు.

అనతరం అంబేడ్కర్‌ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం .

Advertisement

తాజా వార్తలు

Advertisement