Monday, April 29, 2024

2వేల కోట్ల అప్పు కోసం విద్యార్ధుల భవిష్యత్తా క‌ట్టుపెడుతున్న ప్ర‌భుత్వం : పట్టాభి..

అమరావతి, ఆంధ్రప్రభ: రెండు వేల కోట్ల ప్రపంచ బ్యాంక్‌ అప్పుల కోసం విద్యార్ధుల భవిష్యత్‌ ను ప్రభుత్వం తాకట్టు పెడుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ ఆరోపించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానాల వల్ల విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలు చెందుతున్నారని అన్నారు. స్కూళ్ళ విలీనంతో దాదాపు 8 వేల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్నాయని తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్‌ నివేదికలో ఆందోళనకర అంశాలు వెలుగు చూస్తున్నాయని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్మెంట్‌ 2.80 లక్షలకు తగ్గిపోయినట్లుగా స్పష్టమవుతుందన్నారు. కేంద్ర లెక్కల ప్రకారం పదవ తరగతిలో 31.3 శాతం డ్రాపవుట్‌ రేట్‌ ఉందని వెల్లడించారు. ఇది ఈ ప్రభుత్వం సాధించిన విద్యా ప్రగతని పట్టాభి మండిపడ్డారు.

ఉపాధ్యాయుల నిష్పత్తి తగ్గిపోయిందని, కొరతను సరిచేసుకోవాలని కేంద్రం సూచించిందన్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక పాఠశాలల్లో 39 వేలకు పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రాధమిక ఉన్నత పాఠశాలలో మరో 11800 పైగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడయ్యిందన్నారు. దాదాపు మొత్తం 50,896 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడంతో ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్య భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. కేంద్రం వెల్లడించిన ఈ అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement