Tuesday, May 7, 2024

Followup : ప్రాణాలు తీసిన సరదా.. పూడిమడక సముద్రతీరంలో ఏడుగురు గల్లంతు..

అచ్యుతాపురం, విశాఖపట్నం , ప్రభన్యూస్‌ బ్యూరో: ఉమ్మడి విశాఖ జిల్లాలో అంతులేని విషాదం నెలకొన్నది. అనకాపల్లి జిల్లా పరిధిలోని పూడిమడక సముద్రతీరంలో మరో విషాదఘటన చోటుచేసుకుంది. అనకాపల్లిలో (డైట్‌) ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్ధులు శుక్రవారం పూడిమడక తీరానికి చేరుకుని, సరదాగా గడపాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే 15 మంది విద్యార్ధులు ఈతకొట్టే ప్రయత్నం చేశారు. అయితే పూడిమడక సముద్రతీరప్రాంతంలో అలల ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ నేపధ్యంలోనే ఏడుగురు విద్యార్ధులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. అయితే వీరిలో ఒక విద్యార్ధి (పవన్‌) ఇప్పటికే మృతి చెందగా మృతదేహం కూడా ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఇక మరో విద్యార్ధి తేజ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యసహాయం అందిస్తున్నారు. మరో ఐదుగురు విద్యార్ధులు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరిలో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన జగదీష్‌, నర్సీపట్నంకు చెందిన జశ్వంత్‌, గుంటూరుకు చెందిన సతీష్‌, చూచుకొండకు చెందిన గణేష్‌, యలమంచలికి చెందిన చందులు గల్లంతయ్యారు. అయితే వీరి కోసం తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

గల్లంతైన విద్యార్ధుల కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. వీరంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో వైపు మెరైన్‌, కోస్ట్‌ గార్డు సిబ్బందితో పాటు మరికొంత మంది రక్షణ సిబ్బంది సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పూడిమడక సముద్రతీరంలో తమ పిల్లలు గల్లంతయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయా కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆశించామని, ఇంతలోనే ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదని పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ సహచర విద్యార్ధులు మృత్యుబాట పట్టారని తెలుసుకున్న సహచర విద్యార్ధులు పెద్ద ఎత్తున పూడిమడక ప్రాంతానికి చేరుకున్నారు. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement