Wednesday, May 22, 2024

కొత్త జిల్లాల పాలన ఇక్కడి నుంచే.. నోటిఫై చేసిన ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొలువు దీరనున్న కొత్త పాలనా భవనాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం నుంచి పాలన ప్రారంభించే భవనాలు ఎక్కడనేదానిపై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పాలన కేంద్రంగా శ్రీకాకుళంలోని కొత్తపేట జంక్షన్‌, విజయనగరం జిల్లాకు విజయనగరంలోని కంటోన్మెంట్‌, పార్వతీపురం మన్యం జిల్లాకు పార్వతీపురంలోని ప్రకాశం టౌన్‌ హాల్‌ ఎదురుగా ఉన్న బెల్గాం ఐటీడీఏ భవనం, విశాఖపట్టణం జిల్లా కేంద్రమైన విశాఖలోని మహారాణి పేట, అనకాపల్లి జిల్లా పాలనా కేంద్రం అనకాపల్లి శంకరం గ్రామంలోని ఇండో అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌(పూర్ణా మహాల్‌)లో జిల్లా పాలనా భవనాలు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు జిల్లా కేంద్రమైన పాడేరు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ బిల్డింగ్‌, కాకినాడ జిల్లా కేంద్రానికి కాకినాడలోని కలెక్టర్‌ కార్యాలయం, కోనసీమ జిల్లాకు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని డీఆర్డీఎ భవనం, తూర్పు గోదావరికి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోని దవళేశ్వరం గ్రామంలో ఉన్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిల్డింగ్‌, ఏలూరుకు జిల్లా కేంద్రమైన ఏలూరులో కొత్త బస్టాండ్‌ వద్ద పాలనా భవనాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

పశ్చిమ గోదావరికి జిల్లా కేంద్రమైన భీమవరం మారుతీనగర్‌లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కాలేజీ, కృష్ణా జిల్లాకు పాలనా కేంద్రమైన మచిలీపట్నం చిలకలపూడి, ఎన్‌టీఆర్‌ జిల్లాకు పాలన కేంద్రమైన విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని బాపూ మ్యూజియం పక్కన, గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం పాలెం, బాపట్లకు జిల్లా కేంద్రమైన బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ ఎక్స్‌టెన్షన్‌ క్యాంపస్‌, పల్నాడుకు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట లింగంగుంట్ల కాలనీలోని వాటర్‌ రిసోర్స్‌ డిపార్టుమెంట్‌ భనంలో పాలన కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రకాశంకి జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రకాశం భవనం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరుకు నెల్లూరు ఆచారి వీధిలో, తిరుపతి జిల్లాకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం, చిత్తూరుకు చిత్తూరు రెడ్డిగుంటలో భవనాలు సమకూర్చారు. అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రమైన రాయచోటిలోని మాసాపేట రాజీవ్‌ స్వగృహ పక్కనున్న ప్రభుత్వ భవనం, వైఎస్సార్‌ఒ కడప జిల్లాకు కడప కొత్త కలెక్టరేట్‌లోని సీ బ్లాక్‌, అనంతపురం జిల్లాకు అనంతపురం బెంగుళూరు రోడ్డులోని బుడ్డప్ప నగర్‌, శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తి సత్యసాయి మ్యూజిక్‌ కాలేజీ, కర్నూలు జిల్లాకు కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగానున్న బధవారపేట, నంద్యాల జిల్లాకు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం భవనంలో కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement