Saturday, May 4, 2024

చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ చేయూత అవసరం: బాలకృష్ణ

చిత్ర పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాలపై ఉందని  సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో ‘అఖండ కృతజ్ఞత సభ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖండ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి, నటులు శ్రీకాంత్‌, ఇతర నటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కరోనా మూలంగా చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతిందన్నారు. అటువంటి సమయంలో అఖండ చిత్రం సినీ పరిశ్రమకు ఊపిరి పోసిందన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సినిమా కర్నూలు జిల్లాలోని 3 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలు ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ… తాను బాలకృష్ణతో చేసిన మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయన్నరు. ప్రస్తుత సినిమాలు 50 రోజులు కూడా ఆడటం లేదని పేర్కొన్నారు. 100 రోజుల వేడుక జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మాస్‌ చిత్రాల విజయానికి పురిటిగడ్డ రాయలసీమ అని గుర్తు చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ… సినీ పరిశ్రమలో కేవలం తన ప్రయాణం కొంత మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం ద్వారా తన ప్రయాణం సుదీర్ఘం అయ్యేలా చేసిందని తెలిపారు.

హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ… భవిష్యత్తులో మంచి చిత్రాలను తీస్తే తప్పనిసరిగా ఆదరిస్తారని పేర్కొన్నారు. ఈ వేడుకలలో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు  ప్రసంగించారు. శతదినోత్సవ వేడుకల సందర్భంగా హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు చిత్రంలో ఉన్న పలు పాటలకు సినీ కళాకారుల ప్రదర్శన నిర్వహించారు. టిడిపి నాయకులు, నందమూరి అభిమాన  పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement