Sunday, May 19, 2024

Telugu Desam – ముంద‌స్తు సెల‌క్ష‌న్ … అభ్య‌ర్ధుల ఎంపిక‌పై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు..

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్దమవుతోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని భావిస్తు న్న ఆ పార్టీ అభ్యర్దుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుగానే అభ్యర్దులను ప్రకటించే యోచనలో ఉన్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఆ మేరకు కసరత్తును మొదలు పెట్టింది. నియోజకవర్గాల వారీగా నేతల పని తీరుపై ఓ కన్నెసిన అధిష్టానం ఇప్పుడు సర్వేలను మొదలుపెట్టింది. గతంలో చేసిన సర్వే నివేదికలు, పార్టీ వ్యూహకర్తలు ఇచ్చిన సమాచారం, ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగా అభ్యర్దుల కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో స్దానిక ప్రజల నాడీ, క్యాడర్‌కు అనుగుణంగా ఉన్న నేతలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ఈ మేరకు మార్పులు, చేర్పులు చేసిన అధిష్టానం ఇప్పుడు తాజాగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలను తయారు చేస్తోంది.పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు సంస్ధాగత ప్రక్షాళన అవసరమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నియోజకవర్గాల్లో పరిస్ధితులను ఆయన స్వయంగా తెలుసుకుంటూ గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో మాదిరిగా ఎటువంటి ఒత్తిళ్ళు , ఇతర అంశాలు ప్రభావితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నేతలకు ఇదే అంశాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పని తీరు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని ఎటువంటి ఒత్తిడికి లొంగేది లేదని తేల్చి చెప్పారు. ఇంకోక వైపు గతంలో మాదిరిగా చివరి నిమిషంలో అభ్యర్దులను ఖరారు చేయకుండా ఈ సారి ముందస్తుగానే ఎంపిక చేయాలని భావిస్తున్నారు. సర్వే రిపోర్టులు , పార్టీ వ్యూహకర్తల నివేదికలను కూలంకుషంగా పరిశీలిస్తూ అభ్యర్ధుల వడపోత కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. బలమైన అభ్యర్దులను రంగంలోకి దింపి సత్తా చాటాలన్న యోచన లో ఆ పార్టీ అధినేత ఉన్నారు.

దసరాకు అభ్యర్దుల ఎంపిక కొలిక్కి ..
ఇదిలా ఉంటే అసెంబ్లి ,పార్లమెంటు అభ్యర్ధులను దసరా నాటికి దాదాపు ఖరారు చేయాలన ్న నిర్ణయానికి టీడీపీ అధిష్టానం వచ్చింది. ఎన్నికల ప్రధాన మ్యానిఫెస్టోతో పాటు 70 నుంచి 75 మంది అభ్యర్దులను ప్రకటించాలన్న భావనలో ఆ పార్టీ ఉంది.నియోజకవర్గాలలో నేతలు ముందస్తుగానే పని చేస్తే గెలుపు తధ్యమన్న దీమాలో ఉన్న అధినాయకత్వం ఈ క్రమంలోనే అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఈ లోగా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం , నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధిపత్య పోరుకు కళ్ళెంవేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. నేతల మధ్యల అంతరాలను, విభేదాలకు చెక్‌ పెట్టి తద్వారా పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పొత్తులు ఉన్నా లేకున్నా ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేసి అధికారం కైవసం చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఆర్ధిక, అంగబలం ఉన్న నేతలతో పాటు కొత్త వారికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement