Tuesday, May 14, 2024

దేవుని సొమ్ము అపహరిస్తే శునక జన్మమే!

శ్రీరాముడి రాజ్యపాలన కాలంలో ధర్మానికి, న్యాయానికి కొరతలేదని తెలిసిన ఒక శునకం, ఒకనాడు ఆయన భవనం ముందే వచ్చి కూర్చుంది. తలమీద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉన్న ఆ శునకాన్ని లక్ష్మణుడు చూసి, జాలిపడి, ఏంజరిగిందో చెప్ప మని అడుగుతాడు. అంత బాధలో ఉండి కూడా చలించని ఆ శునకం, అదంతా నేను ప్రభువు లైన శ్రీరాముల వారితోనే చెబుతాను అని బెట్టుపోతుంది. ఆ మాటలకు ఇది మామూలు శున కంలాలేదని గ్రహంచిన లక్ష్మణుడు, కొలువులో ప్రవేశించి, ఆరోజు అన్నగారితో విన్నవించు కోవాల్సిన ముఖ్యమైన అన్ని సంగతులతోపాటుగా, ఇంటిముందు కూర్చుని ఉన్న ఆ శున కం సంగతి కూడా చెబుతాడు. లోనికి వచ్చి, తాను చెప్పుకోవాల్సిందేదో చెప్పుకోవచ్చని కబురంపుతాడు శ్రీరాముడు లక్ష్మణయ్య చేత. పెద్దపెద్ద వాళ్ళంతా కూర్చుని ఉండే ఆ సభలో నికి నేను రావడమేమిటి? నావల్ల కాదు అది, అని తిరిగి కబురు పంపుతుంది ఆ శునకం. సరేలెమ్మని శ్రీరాములవారే శునకం దగ్గరకు వెళ్ళి ”ఏమిటి నీ ఇబ్బంది?” అని అడుగుతాడు.
ఉ|| ఆమృగదంశ కంబని యెనర్క కులేంద్రయలర్కమేమియిం
దేమిటికేఁగుదెంచినది యేటికిఁగొట్టుమునాకలీనినేఁ
డీమునులీనృపాలమణులిందఱుగొల్వఁగనిందువచ్చినా
వేమనినీదయాధికసమిద్ధ గుణంబులు సన్నుతింపుదున్‌.
(కంకంటి పాపరాజు, ఉత్తరరామాయణం, సప్తమాశ్వాసం, 14వపద్యం)
”ఇనకుల తిలకుడవైన ఓ శ్రీరామా! ఈ కుక్క ఇక్కడికి ఎందుకొచ్చింది, దీనికి ఇక్కడ ఏమి పని, దూరం వెళ్ళిపోయేలాగా దీనిని కొట్టండి అనకుండా, అంతమంది సామంతరాజులు, మునిపుంగవులు కొలువుతీరివున్న ఆస్థానంలో సింహాసనాన్ని వదిలి నన్ను కలుసుకోవడానికి వచ్చిన నీ దయార్ద్ర హృదయాన్ని గురించి ఏ రీతిగా పొగడను?” అని భక్తితో తలవంచి- ”సాధు రక్షణ ప్రభువు ధర్మం కాబట్టి నా బాధ ఇప్పుడు నీతో విన్న వించుకుంటున్నాను. ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టకుండా ఎప్పుడూ నా దారిన నేను తిరుగుతూ ఉండేదానను నేను. అలాంటి నన్ను, ఈ రోజు ఒక భిక్షుకుడు అకారణంగా నా తలపై దెబ్బ తగిలి రక్తం కారేట్లుగా కొట్టాడు. అతగాడిని వెంటనే పిలిచి, సంగతిని తగినవిధంగా పరామ ర్శించి న్యాయం చేస్తావనే నమ్మకంతో ఇలా వచ్చాను” అని అసలు సంగతి చెబుతుంది.
ఉ|| అక్కరుణాబ్ధిరామవిభుఁడప్పుడెభిక్షుకుబిల్వఁబంచియి
క్కుక్కకు నీకు నేమి పగకోపముతోఁదలవ్రయ్యగొట్టినా
వక్కట! విప్రవంశజు!డవయ్యుదురాగ్రహ శత్రుగెల్వలే
వెక్కడి భిక్షుకత్వ మిదియేటి విరక్తియటంచు దూఱినన్‌.
(కంకంటిపాపరాజు, ఉత్తరరామాయణం, సప్తమాశ్వాసం, 18వపద్యం)
అప్పటికప్పుడే శ్రీరాముడు ఆ బిక్షుకుడిని పిలిపించి, ”ఈ కుక్కపై నీకెందుకు అంత పగ? తల పగిలేటట్లు కొట్టావే? కోపాన్ని అదుపులో పెట్టుకోలేని స్థితిలో ఉన్న నీ భిక్షుకత్వం ఏమి విలువైనది? ఇంతటి అసహనం, విరక్తి నీలో కలగడానికి అసలైన కారణం ఏమిటి?” అని కాస్త గట్టిగా కోప ంతో అడుగగా, అతగాడు వణికిపోయి, వెంటనే చేతులు జోడించి నమ స్కరించి ఇలా చెప్పాడు.
తే.గీ. దేవభిక్షార్థమింటింటఁ దిరిగితిరిగి
యలసినేరాఁగనిది వీధినడ్డమగుచుఁ
దలఁగకున్నను గొట్టితిదప్పుగలదు.
(కంకంటిపాపరాజు, ఉత్తరరామాయణం, సప్తమాశ్వాసం, 19వ పద్యంలో భాగం)
”స్వామీ, భిక్ష కోసం ఇంటింటా తిరిగి అలసిపోయి ఉన్న నా కాళ్ళకు ఇది వీధిలోకి రాగా నే అడ్డుపడగా కోపం వచ్చి కొట్టాను. నాది తప్పే!” అంటాడు ఆ భిక్షుకుడు. అంతేకాకుండా ‘దండిచాలనిపిస్తే దండించండి. శ్రీరాముల వారు దండిస్తే, ఆపై యముడి చేతిలో దండన తప్పిపోయినవాడనౌతాను. అదీ ఒకరకంగా నాకు మంచికే!” అని కూడా అంటాడు.
విన్న శ్రీరాముడు ”సరే అయితే, ఏమిదండన వేయాలో ఈ శునకమే నిర్ణయిస్తుంది” అం టాడు. ‘కాలాంజనమనే పేరున్న గిరిదుర్గంలోని దేవళానికి ఇతగాడిని అధిపతిని చెయ్యండి” అంటుంది శునకం. అలాగే చేస్తాడు శ్రీరాముడు. ”శిక్ష వెయ్యమంటే దుర్గంలో దేవళానికి అధిపతిని చెయ్యడమేమిటి? ఇదేమి వింత?!” అని కొలువులో ఉండి చూస్తున్న వారంతా ఆశ్చర్యపోగా, శ్రీరాముడు ఒక చిరునవ్వు నవ్వి, ”దీనికి సంబంధించిన వివరణను కూడా ఆ శునకమే ఇస్తుందని” చెబుతాడు.
ఉ|| ఎంచఁగనింతకంటెఁగలదేయవమానముదేవతొల్లినే
నంచిత విప్రవంశజుడనైయలదేవ గృహాధిపత్యమున్‌
గాంచితదన్న భుక్తిఁగొనికాదెవహంచితినిట్టిజన్మమున్‌
గొంచెమె దేవతార్థహృత కుక్కతనం మొనరింపకుండునే.
(కంకంటిపాపరాజు, ఉత్తరరామాయణం, సప్తమాశ్వాసం, 24వ పద్యం)
”పూర్వజన్మలో నేను కూడా ఒక దేవాలయానికి అధిపతినైయుండి, ఆ ఆదాయం నుం డి వచ్చిన అన్నం తింటూ, దేవుని సొమ్ము దొంగిలించే అపచారం చేసి కదా ఈ జన్మలో కుక్క నై జన్మించినది. దేవుని సొమ్ము కాజేసేది కొంచెమైనా, ఆపాపం కారణంగా మలిజన్మలో సంక్రమించేది కుక్క తనమే కదా!’ అని విశదీకరించిన ఆ శునకం ‘అయితే, నా అదృష్టం కొద్దీ, అప్పట్లో కొద్దో గొప్పో సాదుసంసేవనము, దీన జన పోషణము అనే మంచి పనులు కొన్నైనా చేసి ఉండడం వలన, ఈజన్మలో ఈమాత్రం పూర్వజన్మకు సంబంధించిన స్మరణశక్తి కలిగి యుండే సౌఖ్యం నాకు వరంగా లభించింది. ఇప్పుడు కొత్తగా లభించిన ఈ దేవాలయ అధి కారంతో ఈ భిక్షుకుడు మరి తానేమి కాగలడో తన చేతల ద్వారా అతడే నిర్ణయించుకుం టాడు” అని చెప్పి శ్రీరామునికి నమస్కరించి, కాశీకి వెళ్ళిపోతుంది ఆ శునకం. దేవుని సొమ్మ ని కూడా చూడదు, అధికారం మనుషులను పాపం చేయ డానికి ప్రోత్సహస్తుంది. పాపకర్మ చేయడానికి అవకాశం వున్నప్పటికీ, చేయనివాడే నిజమైన మనిషి.

Advertisement

తాజా వార్తలు

Advertisement