Saturday, June 22, 2024

TS | నకిలీ విత్తన మాఫియా.. రైతుల‌కు ర‌క్ష‌ణ‌గా ప్రభుత్వం చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఖరీఫ్‌ సీజన్‌ సమీపించిన నేపథ్యంలో నకిలీ విత్తన మాఫియా మరోసారి పడగవిప్పింది. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయశాఖ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏటా నకిలీ విత్తన మాఫియా బారిన పడి రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతూనే ఉన్నారు.

పుడమిని నమ్ముకుని సేద్యం చేసే అన్నదాతలను ఏటా కల్తీ, నకిలీ విత్తనాలు నష్టాలకు గురిచేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మరో 15 రోజుల్లో వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలతో అక్రమార్కులు గ్రామాల్లో తిష్ట వేసినట్లు రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి, వరి తదితర విత్తనాలు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్‌, గుంటూరు, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి డంప్‌ అవుతున్నాయి. అక్రమార్కులు భారీ దిగుబడి ఆశచూపి రైతులకు యథేచ్ఛగా నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు.

ప్రధానంగా పొరుగు రాష్ట్రాలతో రాష్ట్రాన్న అనుసంధానం చేసే జాతీయ రహదారులకు చేరువలో ఉన్న పట్టణాలు, గ్రామాలు నకిలీ విత్తనాల డంప్‌లకు కేంద్రాలుగా మారుతున్నాయి. సరుకు రవాణా వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండానకిలీ విత్తనాలు తెలంగాణలో పెద్ద ఎత్తున వచ్చిపడుతున్నాయన్న ఆందోళన వ్యవసాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏటా ఖరీఫ్‌లో తెలంగాణలో ప్రధానంగా వరి, పత్తి, కంది, సోయా, మొక్కజొన్న తదితర పంటలు పెద్ద ఎత్తున సాగవుతుంటాయి. ఇందులో ఒక్క వరి పంటే కనీసం 60లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక పత్తి కనీసం 40లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఒక్క ఎకరా పత్తి సాగుకు 900 గ్రాముల విత్తనాలు కావాల్సి ఉంటుంది.

- Advertisement -

గింజలు విత్తాక మొలవని చోట పోగుంటలను కలుపుకుని ప్రతీ ఎకరాకు కిలో విత్తనాలు అవసమవుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్క పత్తి విత్తనాలే దాదాపు 45లక్షల కిలోల మేర అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా చీడల దాడిని తట్టుకుని బీటీ రకం పత్తి తెలంగాణలోని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.

అయితే బీటీ-2 రకం పత్తి విత్తనాలను రైతులకు అందించాల్సి ఉండగా నకిలీ విత్తన మాఫియా నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతోంది. అయితే ప్రభుత్వం నిషేధించినా బీటీ-3 పత్తి సాగుతో చీడపీడలు ఆశించవని రైతులను నకిలీ విత్తన మాఫియా మభ్యపెడుతోంది.

దీంతో రూ.864కు వచ్చే సాధారణ బీటీ-2 రకం పత్తి విత్తనాలకు బదులు రూ.1500కు వచ్చే బీటీ-3 పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. తీరా సాగు చేశాక బీటీ-3 విత్తనాలతో పంట దిగుబడిసరిగా రాకపోవడంతోపాటు ఆ విత్తనాల విష ప్రభావంతో రైతులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతీ జిల్లాలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ టీంల ఏర్పాటు…

మరో పది రోజుల్లో వానాకాలం సాగు ముమ్మరం కానుండడంతో గత అనుభవాల నేపథ్యంలో నకిలీ విత్తనాల సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. నకిలీ విత్తనాలను అమ్మినవారిపై పీడీ యాక్టు కేసులు పెట్టేందుకు సిద్దమైంది.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా నకిలీ పత్తి, సోయా,మొక్కజొన్న విత్తనాలను రైతులకు అంటగడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ విషయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రతీ జిల్లాలో ప్రత్యేకంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ టీంలు ఏర్పాటయ్యాయి. ఈ టాస్క్‌ఫోర్స్‌ లోజిల్లా వ్యవసాయశాఖ అధికారితోపాటు తెలంగాణ సీడ్‌ అధికారి, ఇద్దరు ఏవోలు, పోలీసుశాఖ అధికారి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వానాకాలంలోనైనా నకిలీ విత్తన మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా..? అన్నది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement