Sunday, October 6, 2024

ఈవీఎంలపై టీడీపీ యూటర్న్‌!

ఈసీ భేటీలో తెలుగుదేశం కీలక నిర్ణయం
గతంలో బ్యాలెట్‌ ఓటింగ్‌కు పట్టు
తాజాగా మారిన టీడీపీ నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సరికొత్త విధానాలను అవలంబించబోతోంది. అయితే గతంలో ఓటింగ్‌ విధానాలను వ్యతిరేకించిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. తాజాగా రిమోట్‌ ఓటింగ్‌ విధానానికి మద్దతు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోతున్న నిర్ణయం చాలా బాగుందంటూ ప్రశంసించ డాన్ని బట్టి చూస్తుంటే టీడీపీ ఎన్నికల విధానంలో యూటర్న్‌ తీసుకుందా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవు తోంది. ఢిల్లీలో జరిగిన రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ-లో ఈసీ నిర్ణయానికి అనుకూలం గా మద్దతును ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం గతంలో తాము తీసుకున్న ఓ విధాన పరమైన నిర్ణయానికి పూర్తి భిన్నంగా ఉండటంతో టీ-డీపీ యూటర్న్‌ పై రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. గతంలో ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సుల విధానం ఉండేది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈవీఎంల విధానా న్ని తీసుకొచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీతో మిత్రపక్షంగా కలిసి పోటీ చేసిన తెలుగుదేశం 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఈవీఎంలకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుని అవకాశం ఉందని , రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోతున్న తాజా నిర్ణయానికి జై కొట్టినట్లు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు
రాష్ట్రంలో 2019 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్‌ , అసెంబ్లి ఎన్నికలు ఒకే సందర్భంలో నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎ ంల విధానం ద్వారా ఎన్నికల ప్రక్రియను అప్పట్లో పూర్తి చేసింది. అయితే ఆ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమౖౖెన టీడీపీతో పాటు దేశ వ్యాప్తంగా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే అంశంపై ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అప్పట్లో ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల్లో కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంల ద్వారానే ఎన్నికల ప్రక్రియకు వెళ్లింది. అయితే ఆ సమయంలో టీడీపీ.. బీజేపీతో ఉన్న స్నేహ బంధాన్ని వదులుకుని ఒంటరిగా పోటీ చేసింది. అయితే గడిచిన మూడున్నర సంవత్సర కాలంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం తన మిత్రపక్షమైన బీజేపీ , జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. ఈ క్రమంలో ఈసీ తాజా నిర్ణయాన్నిటీడీపీ సమర్థించడం చర్చానీయాంశంగా మారింది.

రిమోట్‌ విధానానికి జై..
గతంలో ఈవీఎంల విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాలెట్‌ విధానానికి డిమాండ్‌ చేసిన తెలుగుదేశం వ్యూహాత్మకంగా రిమోట్‌ విధానానికి జై కొట్టింది. భవిష్యత్తులో ఎన్నికల్లో వాడేందుకు ఈసీ వాడబోతున్న రిమోట్‌ ఓటింగ్‌ యంత్రంపై అవగాహన కలిగించేందుకు ఢిల్లీలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు- చేసింది. గత రెండు రోజుల క్రితం ఢిల్లిd వేదికగా జరిగిన కీలకమైన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ సభ్యుడు వేమూరి రవికుమార్‌లు హాజరయ్యారు. వారు రిమోట్‌ ఈవీఎంల వాడకంపై తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు మద్దతు కూడా ప్రకటించారు. అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోతున్న తాజా నిర్ణయం వల్ల ఓటు హక్కు ఎక్కడ నుంచైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని సమర్ధించారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటింగ్‌ శాతం కూడా మరింత పెరగడంతో పాటు అక్రమాలు కూడా పెరిగే అవకాశం ఉండదని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతీయ పార్టీలు రిమోట్‌ ఓటింగ్‌ యంత్రాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసీ భేటీలో తమ వాదనను బలంగా వినిపించాయి. అయితే తెలుగుదేశం గతంలో అవే పార్టీలతోగొంతు కలిపి ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. తాజాగా సమర్థించడంపై తెలుగుదేశం యూటర్న్‌ తీసుకుందా అన్న సందేహాలు ఆయా ప్రధాన పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

చంద్రబాబు సరికొత్త వ్యూహం
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అందుకోసం అవసరమైతే 2014 ఎన్నికల తరహాలోనే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన, బీజేపీలతో కలిసి పొత్తులతో బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఆ దిశగానే ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌తో పలు సందర్భాల్లో పొత్తులపై చర్చలు కూడా జరిపినట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణాలో టీడీపీ మద్దతును దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబుతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘ తాజా నిర్ణయానికి మద్దతు తెలపడం ఆయన సరికొత్త వ్యూహానికి సిద్ధమవుతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement