Thursday, April 18, 2024

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం : తిరుపతి కలెక్టర్

తిరుపతి సిటీ : నూతన తిరుపతి జిల్లాలో మొదటిసారిగా గణతంత్ర వేడుకలను స్థానిక పోలిస్ పెరేడ్ మైదానంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో గణతంత్ర వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని అదే స్పూర్తితో రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించాలని అన్నారు. రిపబ్లిక్ డే దినోత్సవంలో జిల్లా అభివృద్ధి పై ప్రసంగ పాఠం నిమిత్తం వివిధ శాఖలలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సాధించిన అభివృద్ధిపై నివేదికలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి వెంటనే అందించాలని అన్నారు. విద్య , వైద్యం, రీసర్వే, హౌసింగ్, ప్రజాపంపిణీ, సచివాలయాలు, మహిళా సాధికారత వంటి వాటిపై ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ఏర్పాటు చూడాలని అన్నారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వి.మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల సంయుక్తంగా నిర్వహించేలా చూడాలని అన్నారు. పోలీస్ యంత్రాగం పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాట్లు నగరపాలక సంస్థ, రెవెన్యూ, తుడా సహకారం వుంటుందని సూచించారు. జిల్లా అధికారులు తమశాఖ విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాల జాబితా కలెక్టరేట్ కు పంపాలని సూచించారు. ఈ సమీక్షలో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ఆర్డిఓలు కనకనరసా రెడ్డి, కిరణ్ కుమార్ , తుడా సెక్రటరీ లక్ష్మి , ఎఒ జయరాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement