Tuesday, May 14, 2024

TDP/Janasena/BJP = త్రీమెన్ ఆర్మీ! ఎన్నిక‌ల‌కు రెడీ

పొత్తులు ఖాయం.. సీట్ల లెక్కే ఆలస్యం
ఏపీలో తెరమీదకు మిత్ర త్రయం
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సానుకూల చర్చలు
అమిత్‌షా, నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ
నేడు పవన్ కళ్యాణ్‌తో సంప్రదింపులు
బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు..
ఆరు ఎంపీ సీట్లు ఇస్తామ‌ని చంద్రబాబు ఆఫర్
ఇంకా సీట్ల పంప‌కాల‌పై రాని క్లారిటీ

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ) – ఏపీ రాజకీయాల్లో పొత్తులు, ఎత్తులు తెరమీదకు వ‌చ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగానే బీజేపీతో దోస్తానా ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. హస్తినలో టీడీపీ. బీజేపీ మధ్య ఒడంబడిక చర్చలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాబు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో.. బీజేపీనీ తమ కూటమిలో చేర్చుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారని ప్రచారంలో ఉంది. ఈ తరుణంలోనే ఢిల్లీ కమలనాథుల నుంచి చంద్రబాబుకి ఆహ్వానం అందిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ కూటమిలో చేరడానికి టీడీపీ, జెఎస్పీ అధిష్టానాలు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. మరి సీట్ల విషయంలో బీజేపీ పెట్టే షరతులకు టీడీపీ అధినేత అంగీకరిస్తారా? టీడీపీ ప్రతిపాదించే సీట్లతో బీజేపీ సర్దుకుపోతుందా? అన్న అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల లెక్కలు మారే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న, మొన్నటి దాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. కానీ, ఈ మూడు పార్టీలు ఒక్క‌టి కావ‌డంతో సీట్ల లెక్క‌ల్లోనూ తేడా రానుంది. అందుక‌ని సర్దుబాటు చేసుకోవటం గ్యారంటీ అని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు.

లోక్‌స‌భ గెలుపూ లక్ష్యంగా బీజేపీ..

కూటమిలో చేరడంపై ఇన్నాళ్లు బెట్టు చూపించిన బీజేపీ.. కూటమిలో చేరేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు చర్చలు జ‌రిపారు. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ముగ్గురు నేతల మధ్య మంత్రాంగం నడిచింది. మధ్యవర్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో గురువారం బీజేపీ నాయకులు చర్చలు జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తోంది.

హైక‌మాండ్ ఆదేశాల‌తో..

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు పొడిచినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో పొత్తు పెట్టుకునేందుకు మొన్నటి వరకు ఆసక్తి చూపించని బీజేపీ పెద్దలు ఇప్పటికప్పుడు. పొత్తు దిశగా చర్చలకు సిద్ధం కావడానికి కారణం ఎంపీ సీట్ల లెక్కలేనని చెబుతున్నారు. తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ బీజేపీ సొంతగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు సాధిస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిన జేడీఎస్, టీడీపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ లెక్కలతోనే ఏపీలో కూటమి నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే హడావుడిగా టీడీపీతో టచ్‌లోకి వెళ్లిందనే ప్రచారం సాగుతోంది.

- Advertisement -

పాత మిత్రుల సీట్ల భేరం

2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 15 అసెంబ్లీ, నాలుగు లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీనే వెంపర్లాడింది. అప్పట్లో టీడీపీ ఆ పార్టీకి 15 అసెంబ్లీ, నాలుగు లోక్‌స‌భ‌ స్థానాలను కేటాయించింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. అయితే.. ఇప్పుడు జనసేన పోటీ చేయబోతోంది. ఇక పవన్‌ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సీట్ల కోసం జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి గతంలో ఇచ్చిన సీట్లు దక్కడమే గగనమంటున్నారు.

ఇంకా రాని సీట్ల పంప‌కాలు..

అమిత్ షాతో చంద్రబాబు భేటీ ముగిసిన తరుణంలో.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. ఈ సారి తమ మిత్రపక్షం జనసేన పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేక పోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎన్ని స్థానాలు అడుగుతుందో? ఇదీ టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠత రేకెత్తిస్తోంది. పొత్తుల లెక్కల్లో జనసేనకు 25 నుంచి 27అసెంబ్లీ స్థానాలు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పొత్తు ఖాయమైతే బీజేపీకి కనీసం 10స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని.. అదే విధంగా జనసేనకు 2, బీజేపీ కనీసం 3 లోక్‌స‌భ‌ స్థానాలు కేటాయించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అంటే 35 నుంచి 40 అసెంబ్లీ సెగ్మెంట్లు, 5 ఎంపీ సీట్లు మిత్రపక్షాలకు వెళ్తాయి.

తెలుగు తమ్ముళ్లల్లో ఆందోళన

అక్కడ టికెట్లు ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లను ఓదార్చటమే టీడీపీ అధినేతకు పెద్ద శిరోభారం అన్న వాద‌న కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు బీజేపీకి 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు 3లోక్‌స‌భ‌ స్థానాలు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అరకు, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాలు బీజేపీకి కేటాయించాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. బీజేపీ మాత్రం నరసరావుపేట, విజయవాడ, రాజంపేట ఆశిస్తోందంటున్నారు. తమ పార్టీలో టీడీపీ మాజీ ఎంపీ సుజనాచౌదరిని బరిలోకి దింపడానికి బీజేపీ విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా సీట్ల సర్దుబాటుపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నా.. ఢిల్లీ వెళ్లే ముందు సీట్ల కేటాయింపుపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరపడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా దాదాపు 25 నుంచి 30 సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండటంతో.. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని.. పరిమితంగా సీట్లు కేటాయించాని నేతలు సూచించినట్లు తెలిసింది. బీజేపీ కోరినన్నీ సీట్లు ఇస్తే పార్టీలో నేతల్లో వ్యతిరేకత వస్తుందనే భయం టీడీపీని వెంటాడుతోంది.

మిత్రపక్షాలకు 30 అసెంబ్లీ.. ఆరు లోక్‌స‌భ‌ స్థానాల ఆఫర్

టీడీపీకి కీలక స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షాలకు కేటాయించవద్దన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందని సమాచారం. కీలక స్థానాలను వదులుకుంటే భవిష్యత్తులో పార్టీ నష్టపోతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీతో పొత్తు కొన్నివర్గాలను పార్టీకి దూరం చేస్తుందనే వాదన కూడా ఈ చర్చల సమయంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ వాదనలతో ఏకీభవిస్తూనే.. ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ మద్దతు అవసరమని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఏదీ ఏమైనా బీజేపీకి 8 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ‌ స్థానాలు కేటాయించాలని టీడీపీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారని తమ్ముళ్ల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement