Monday, May 6, 2024

అతీంద్రియ విజ్ఞానానికో విభాగం : టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జన్మ, మృత్యు రహస్యాలు, మానవ శరీరాన్ని నడిపించే శక్తికి సంబంధించిన అతీంద్రియ విజ్ఞానంపై ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సూచించారు. ఈ రోజు ఆ విశ్వవిద్యాలయం 18వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి, అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వేద విద్యను విశ్వవ్యాప్తం చేసి సమాజం ధర్మబద్ధంగా నడవాలనే ఉద్దేశంతో టీటీడీ వేద విశ్వవిద్యాలయం ప్రారంభించిందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపి మంచి వైపు నడిపించే గురుతర బాధ్యతను వేద విద్యార్థులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

కలియుగంలో వేద అభ్యాసకుల ద్వారా ధర్మాన్ని నిలబెట్టే ఆలోచనతోనే స్వామివారు వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు వేదాలను అభ్యసించడమే కాకుండా వేద విజ్ఞానాన్ని నూతన మార్గంలో ప్రపంచానికి అందించేలా కృషి చేయాలన్నారు. అలాగే తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి అందించేందుకు కృషి చేయాలని కర్తవ్య బోధ చేశారు. ప్రపంచంలో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతర వైదిక అంశాలకు సంబంధించి ఎవరికి ఏ సందేహం కలిగినా, ఆధార సహితంగా నివృత్తి చేయగలిగే స్థాయికి వేద విశ్వవిద్యాలయం చేరుకోవాలన్నారు. వేద విద్య, వేద విజ్ఞానం ఆధునిక సమాజానికి అత్యవసరమైన నేటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం ప్రపంచ చిత్రపటంపై ప్రత్యేక స్థానం సాధించుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించి నిర్దిష్ట పరిశోధనలు చేసి ప్రపంచం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైపు చూసేలా పని చేయాలన్నారు.


తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించి అవసరమైన వాటిని పుస్తక రూపంలో తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని ఈవో చెప్పారు. ఇది ప్రపంచంలోనే గొప్ప తాళపత్ర గ్రంథాలయంగా తయారు కావాలని ఆయన చెప్పారు. ఆ కార్యక్రమంలోనే పాల్గొన్న జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ… వేదాలకు ఆధునిక పరిజ్ఞానానికి ఉన్న సంబంధాన్ని వివరించే దిశగా వేద విశ్వవిద్యాలయం మరింతగా కృషి చేయాలన్నారు. అతీంద్రియ విజ్ఞానంపై ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆమె అభినందించారు.

- Advertisement -


విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ…. యూనివర్సిటీలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వేద, ఆగమ, పౌరోహిత ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వేద విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం, పిఆర్ఓ డాక్టర్ బ్రహ్మాచార్యులు, ఆచార్య రామకృష్ణ తోపాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


యూట్యూబ్ ఛానల్ ప్రారంభం …
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన “భారతీయ విజ్ఞాన ధార” యూట్యూబ్ ఛానల్ ను ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవితో కలసి ఆవిష్కరించారు. అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన సురభి న్యూస్ లెటర్, వర్సిటీ పరిశోధన, ప్రచురణల విభాగం రూపొందించిన హరివంశం రెండవ భాగం, బ్రహ్మసూత్ర భాష్యం మొదటి, రెండవ భాగం పుస్తకాలను ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement