Sunday, May 5, 2024

ఎపిలో ఈ మూడు నెల‌లూ ఎండల‌ కుంప‌టి….వ‌డ సెగ‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఈఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగ నున్నాయని, తీర ప్రాంతంలో పెరుగుతున్న ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరి కలు జారీచేసింది. రాష్ట్రంలోని పొడవైన తీరప్రాంతంలో ఈ సీజన్‌ నుండి జూన్‌ చివరి వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే, రాయలసీమ ప్రాంతంలో సాధారణ లేదా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇది సీమ ప్రాంత ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనుంది. అభివృద్ధి చెందుతున్న ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఎల్‌నినో ప్రభావం నైరుతీ రుతుపవనాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు. ఈఎల్‌నినో పరిస్థితులు సముద్ర-ఉపరితలంపై నెలకొన్న ఉష్ణోగ్రతల ప్రకారం అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. దీనివల్ల నైరుతి రుతుపవనాల సమయంలో వర్షపాతం తగ్గవచ్చని అమరావతి ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో కొన్ని సార్లు దేశంలో సాధారణ వర్షపాతం నమోదైన పరిస్థితులు కూడా లేకపోలేదని వారు చెబుతున్నారు.

ఆరుసార్లు కోస్తా ఆంధ్రలో వేడి గాలులు
కోస్తా ఆంధ్ర మాత్రమే ఏప్రిల్‌ మరియు జూన్‌ మధ్య నాలుగు నుండి ఆరు సార్లు వేడి గాలులను ఎదుర్కొంటుందని వారు చెబుతున్నారు. వేడిగాలుల ప్రభావం ప్రజల ఆరోగ్యాలపై కూడా పడే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశముంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, వేడిగాలుల సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు- చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని కూడా వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో 2011 మరియు 2021 మధ్య అత్యధిక సగటు- హీట్‌ వేవ్‌ 106 రోజులపాటు నమోదైన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉండడా ఐఎండీ న్యూఢిల్లీ కూడా వేడి గాలుల తీవ్రతను అంచనావేసింది.

ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఇండో-గంగా మైదానాలు మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతల పెరుగుదలని అంచనా వేసింది. మార్చి చివరి వారంలో పైన పేర్కొన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉండవచ్చని తెలుపుతూ పక్షం రోజులలో రాబోయే వేసవి కోసం సన్నద్ధత కార్యక్రమాలను కూడా కేందరానికి సూచించింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఐఎండీ అమరావతి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేడిగాలుల కారణంగా తలెత్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కూడా వారు ముందస్తుగా తెలియజేస్తున్నారు. తీవ్రమైన వడగాడ్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఓఆర్‌ఎస్‌, సాధారణ మందులు మొదలైన వాటిని నిల్వ చేయాలని వాతావరణ శాఖ ఆరోగ్య శాఖకు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement