Saturday, April 27, 2024

శ్రీశైల దేవస్ధానం పాలక మండలి ప్రమాణ స్వీకారం

శ్రీశైల దేవస్ధానం పాలక మండలి సభ్యుల ఎంపిక ముగిసింది. ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించేందుకు ఎట్టకేలకు శుక్రవారం జీఓ విడుదల చేసింది. దీంతో హుటాహుటిన నేటి తెల్లవారు ఝూమున శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా రెడ్డి వారి చక్రపాణితో సహా 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్ధానం పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో 15 మంది నూతన పాలకమండలి సభ్యలతో ఈఓ లవన్న ప్రమాణం స్వీకారం చేయించారు. ముఖ్య అతిధులుగా తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి హాజరయ్యారు.

వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రమాణస్వీకారం చేయాల్సివుండగా హైకోర్టు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ప్రమాణస్వీకారంపై న్యాయస్థానం స్టే విధించింది. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకాన్ని..ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను సవాలు చేస్తూ.. కర్నూలు జిల్లా గుంజాయ్ తండాకు చెందిన కొర్రా శ్రీనివాసులు నాయక్ అనే గిరిజన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దేవాలయ పాలకమండలిలో గిరిజనులకు ప్రాతిధ్యం లేదని… ప్రభుత్వం నిబంధనలను పాటించకుండానే బోర్డ్ సభ్యులను నియమించిందని స్థానిక గిరిజనుడైన శ్రీనివాసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

గిరిజన నేపథ్యం కలిగిన ఆలయ పాలకమండలిలో వారికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం…నిబంధనల ప్రకారం పాలకమండలిలో ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవెత్తలకు చోటు కల్పించటంవంటివి లేవని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే ఎస్టీ సభ్యునికి రిజర్వేషన్ అమలు చేయలేదని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన విన్న హైకోర్టు ప్రమాణస్వీకారం జరపకుండా వాయిదా వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల వరకు ప్రమాణస్వీకారం చేయించవద్దని ఆదేశించింది.

ఇదిలావుంటే ఈ శ్రీశైలం ఆలయ పాలకమండలి నియామకం అధికార వైసిపిలోనూ అలజడి రేపింది. బోర్డ్ ఛైర్మన్ గా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థివర్గానికి చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నియమించడంపై ఎమ్మెల్యే రోజా అభ్యనతరం వ్యక్తం చేసింది. తనను ఓడించడానికి ప్రయత్నించడమే కాదు గత స్థానికసంస్థల ఎన్నికల్లో చక్రపాణి రెడ్డి పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించాడని రోజా ఆరోపించారు. అలాంటిది అతడికి పదవి ఇవ్వడంపై రోజా అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో రెండు సార్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అయితే ఈ అంశం కొలిక్కి రావడంతో ఎట్టకేలకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ట్రస్ట్ బోర్డులో ఐదుగురు బీసీలు, ఆరుగురు ఓసీలు, ఒక ఎస్టీ సభ్యులు ఉన్నారు. వీరు ఈ పదవిలో రెండేళ్లపాటు  ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement