Wednesday, May 1, 2024

AP | స్కూల్స్​ రీ ఓపెన్​.. దడ పుట్టిస్తున్న ఎండలు

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుండి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఉష్టోగ్రతలు ఎక్కువగా ఉండడం, వడగాల్పులు ఉండడంతో వారం రోజులు పాటు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరుకు ఉదయం 7.30 గంటల నుండి 11.30 గంటల వరకు పాఠశాలలు జరిగాయి. పిల్లలంతా ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ అన్ని రకాల పాఠ శాలలు విద్యార్ధులతో కళకళలాడాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉండడంతో పూర్తిస్తాయిలో విద్యార్ధులు పాఠశాలలకు హాజరు కాలేదు.

సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండే ఎండలు చురచురమన్నాయి. 11.30 గంటల సమాయనికి దాదాపు 40 నుండి 42 డిగ్రీలకు ఎండలు చేరుకున్నాయి. దీంతో విద్యార్ధులు స్కూళ్ల నుండి ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. తల్లితండ్రులు గొడులతో వచ్చి పిల్లలకు ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో ఒకటి, రెండు రోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గుతాయనే ఆశలో తల్లితండ్రులు ఉన్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్‌ను పంపిణీ చేశారు.

బ్యాగ్‌, బుక్స్‌, మూడు జతల డ్రస్‌ మేటీరియల్‌, షూ, బెల్ట్‌, రెండు జతల సాక్స్‌ను పంపిణీ చేశారు. ఒక్కొ విద్యార్ధికి దాదాపు 2,400 రూపాయల విలువ చేసే కిట్‌ను పంపిణీ చేశారు. అయితే కొన్ని పాఠశాలలకు ఇంకా పూర్తి స్థాయిలో కిట్‌లు చేరుకోలేదనే సమాచారం కూడా ఉంది. కాగా బదిలీలు అయిన టీచర్లు ఒక్కొక్కరుగా వచ్చి కొత్తగా పోస్టింగ్‌ ఇచ్చిన చోట జాయిన్‌ అవుతున్నారు. మొదటి రోజు చాలా తక్కువ మందే జాయిన్‌ అయ్యారు. చాలా చోట్ల బదిలీ అయిన టీచర్ల స్థానంలో కొత్త వారు రాకపోవడంతో వారు అక్కడి నుండి స్తాన చలనం లభించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement