Saturday, May 18, 2024

AP | కొనసాగుతున్న ఆపరేషన్‌ స్వేచ్చ-2.. ఇప్పటి వరకు 326 మంది పిల్లలకు విముక్తి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్ధ, వెట్టి చాకిని నిర్మూలనకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా ఇతర సంబంధిత శాఖలతో కలుపుకుని కార్యాచరణ అమలుకు సీఐడి విభాగం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో వెట్టి చాకిరి నిర్మూనల కోసం వారం రోజుల పాటు రాష్ట్రంలో ఆపరేషన్‌ స్వేచ్చ అమలు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించిన సీఐడి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వెట్టి చాకిరికి అలవాటు పడినవారికి విముక్తి కలిగించారు. అదేవిధంగా వెట్టి చాకిరి ప్రోత్సహిస్తున్న వారిపై పలు కేసులు నమోదు చేశారు. దీనికి కొనసాగింపుగా బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలన కోసం సీఐడి ‘ఆపరేషన్‌ స్వేచ్చ-2’కు శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే ఈ రెండో దశ కార్యక్రమం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈనెల జూన్‌ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాలో ప్రారంభమైన స్పెషల్‌ డ్రైవ్‌ ఈనెల 30 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈనెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోని పోలీస్‌ ఇతర శాఖల సమన్వయంతో అధికార బృందాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ స్వేచ్ఛ-2 నిర్వహణలో భాగంగా 12వ తేదీ సోమవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని సీఐడి ప్రధాన కార్యాలయంలో సీఐడి అదనపు డీజీ ఎన్‌ సంజయ్‌ బాల కార్మిక వ్యవస్ధకు వ్యతిరేకంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

- Advertisement -

ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్‌ స్వేచ్చ-2కు మరింత స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐడిలోని ఎస్పీ స్ధాయి అధికారులతోపాటు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ- కమీషనర్‌ గణేశన్‌, చైల్డ్‌ రైట్స్‌ అడ్వొకేసీ ఫౌండేషన్‌ స్టేట్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ తంబీ, బచపన్‌ బచావో ఆందోళన్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ తిరుపతి రావు, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ ప్రతినిధులు క్లెమెంట్‌ డేవిడ్‌, గ్లోరీ మూర్తి, కావూరి నవీన్‌ హాజరయ్యారు.

326 మంది పిల్లలకు విముక్తి..

తొలుత రాష్ట్రంలో వెట్టి చాకిరి నిర్మూలన కోసం తొలి దశలో సీఐడి ఆపరేషన్‌ స్వేచ్చ నిర్వహించింది. కర్మాగారాలు, వ్యాపార కూడళ్ళు, క్వారీలు, బట్టీలు తదితర చోట్ల వెట్టి చేయిస్తున్న వారిని గుర్తించి బాదిత ులకు విముక్తి కలిగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ప్రభుత్వం నుంచి కూడా సీఐడి ప్రశంసలు అందుకుంది. ఈ నేపధ్యంలోనే ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలన ఆపరేషన్‌ స్వేచ్చ-2 స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 326 మంది పిల్లలను రెస్క్యు చేసింది.

వీరిలో 289 మంది బాలురు, 37 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది పిల్లలను చైల్డ్‌ కేర్‌ హోమ్‌లకు పంపగా, 281 మంది పిల్లలను వారి తల్లిదండ్రులతో కలపడానికి సిఐడి కృషి చేసింది. సీఐడి మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కెజివి సరిత పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌ స్వేచ్ఛ-2 కొనసాగుతోంది. ఈక్రమంలో ప్రత్యేక కం ట్రోల్‌ రూము ఏర్పాటు చేసి రోజువారీ ఎంతమంది పిల్లలను బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి కలిగించారు, ఇంకా ఎంతమంది పిల్లలను వారి తల్లి తండ్రులకు, సంరక్షణా గృహాలలో అప్పగించారు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement