Sunday, May 19, 2024

ఆర్టీసీ అధికారులు అప్రమత్తం, వరదలు, వర్షాలపై సమీక్ష.. లోతట్టు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు తగిన సూచనలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా పాలనా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ బస్సులను తిప్పాలని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులను అప్రమత్తం చేశారు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతవావరణ శాఖ చెపుతోంది. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలు, ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఉభయ గోదావరి వంటి చోట్ల కొన్ని మండలాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. వర్షాలు, వరదలకు పలు చోట్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయి. అనేక చోట్ల రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇబ్బంది ఉన్న చోట్ల సర్వీసులను ఇతర రూట్లలో మల్లించాలని అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో జిల్లా పాలనా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని వారు తెలిపారు. గత ఏడాది నవంబర్‌ 19న కడప జిల్లాలో వచ్చిన ఆకస్మిక వరదలకు 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగి గేటు విరగడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలోనే రాజంపేట నందలూరు మధ్య వరద ఉధృతిలో మూడు బస్సులు చిక్కుకున్నాయి. ఇందులో ఒక బస్సు పూర్తిగా నీట మునగడంతో 12 మంది ప్రయాణికులు ప్రాణాలను కోల్పోయారు. ఆ అనుభవాల నేపధ్యంలో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు అవసరమైన ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులకు చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రమాదకర పరిస్థితులు ఏమీ ఎదురు కాలేదని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) కేఎస్‌ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రభ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లాలో కొద్దిగా నీరు ఎక్కువగా ఉండటంతో ఒక రూటులో బస్సులను మల్లించడం మినహా చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement