Monday, May 6, 2024

Accident: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘ‌టన గుంటూరు జిల్లాలో ఇవ్వాల జ‌రిగింది. ఈ ప్రమాదలో బస్సు డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ‌న‌ష్టం మాత్రం జ‌ర‌గ‌లేదు. తమిళనాడు రాజధాని చెన్నై నుండి కాకినాడ కు ప్రయాణికులతో నిన్నరాత్రి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఈ బస్సు ఇవ్వాల‌ తెల్లవారుజామున గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో ప్రయాణిస్తుండగా ఒక్కసారికి అదుపుతప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడో ఏమో కొలనుకొండ సాయిబాబా ఆలయం వద్ద రోడ్డుపక్కన నిలిపివుంచిన లారీని గుర్తించలేకపోయాడు. దీంతో జాతీయ రహదారిపై మంచి వేగంలో ఉన్న బస్సు అదుపుతప్పి అమాంతం లారీపైకి దూసుకెళ్లింది. లారీని వెనకనుండి ఢీ కొట్టడంతో బస్సు ముందుబాగం పూర్తిగా ధ్వంసమయ్యింది.

ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లు ఈ నలుగురి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపైనుండి బస్సును తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.

అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా ఇవ్వాల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం అంబాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చ‌నిపోయారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విజయనగరం వెళ్తున్న క్ర‌మంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వెంటనే మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో వేడుక జరిగే ప్రదేశానికి చేరుకుంటారని అనుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement