Sunday, May 19, 2024

విలేజ్‌ మాల్‌ సరుకుల తొలగింపు

గత ప్రభుత్వ హయాంలో గోదాముల్లో నిల్వ ఉంచిన విలేజ్‌ మాల్‌ సరుకులను ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత తొలగించారు. కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో విలేజ్‌ మాల్‌ కింద మిగిలిన సరుకులను ఎంఎల్‌ఎస్‌ గోదాముల్లో నిల్వ ఉంచారు. దాదాపు ఐదేళ్లకు పైగా సరుకులు నిల్వ ఉండటంతో రూ.అరకోటి విలువ చేసే సరుకు పురుగు పట్టి పిండిగా మారింది. ఈ విషయంపై గతంలో ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం ప్రచురించడంతో రెవెన్యూ విభాగం జేసీ రామ్‌సుందర్ రెడ్డి స్పందించారు. చొరవ తీసుకుని గోదాముల్లో ఉన్న స్టాకును తరలించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ యంత్రాంగానికి రెండుసార్లు జేసీ లేఖ రాయడంతోనే విలేజ్‌ మాల్‌ సరుకులను ఎంఎల్‌ఎస్‌ గోదాము నుంచి తొలగించారు. దీంతో పౌరసరఫరాల సంస్థ యంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకుంది. దాదాపు ఐదేళ్లుగా ఎంఎల్‌ఎస్‌ గోదాముల్లో అరకోటికి పైగా వస్తువులు నిల్వ ఉంచడంతో గోదాముల కొరత ఏర్పడింది.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కార్డుదారులకు ఉచిత రేషన్‌ పంపిణీకి సరుకులు కేటాయించడంతో జిల్లాకు ఇచ్చిన ఉచిత బియ్యాన్ని నిల్వ చేసుకోవడానికి పౌరసరఫరాల సంస్థ యంత్రాంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదోని, నంద్యాలలో నిల్వ ఉంచిన విలేజ్‌ మాల్‌ సరుకులను ఎట్టకేలకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేకంగా పంచనామా చేసి ఎట్టకేలకు తొలగించారు. అరకోటికి పైగా వస్తువులు వృథా అయిపోయాయి.ఇప్పటికే విలేజ్‌ మాల్స్‌కు సంబంధించి పెండింగ్‌ బకాయిల కోసం డీలర్లకు పలుమార్లు షాకాజ్‌ నోటీసులు జారీచేసిన విషయం విదితమే.

గత తెలుగుదేశం హయాంలో విలేజ్‌మాల్‌ ఏర్పాటు చేసి తక్కువ ధరలకు పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని భావించి సరుకులను సిద్దం చేసి గోదాముల్లో నిల్వ ఉంచారు. ప్రభుత్వం మారడంతో విలేజ్‌మాల్స్‌ గురించి అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఆ సరుకులు పురుగు పట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయి. అప్పటికే విలేజ్‌ మాల్స్‌ సరుకుల బకాయికి సంబంధించి పౌరసరఫరాల శాఖ, డీలర్ల మధ్య కొంత వ్యత్యాసం ఉండేది. ప్రస్తుతం గోదాముల్లో నిల్వ ఉంచిన పురుగుపట్టిన సరుకులను తొలగించడంతో ఆ బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగింది. మొత్తంపైన జిల్లాలో విలేజ్‌ మాల్‌లో నిల్వ ఉంచిన సరుకులను ఎట్టకేలకు సంబంధిత గోదాముల నుండి వీడియోగ్రఫీ ద్వారా తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement