Thursday, May 9, 2024

సరుకు రవాణా వినియోగదారులకు రైల్‌ గ్రీన్‌ పాయింట్లు – ఏప్రిల్‌లో ప్రారంభించే యోచన

అమరావతి, ఆంధ్రప్రభ: భారతీయ రైల్వే సరుకు రవాణా వినియోగదారులకు రైల్‌ గ్రీన్‌ పాయింట్స్‌ ఇవ్వాలని రైల్వే శాఖ భావిస్తోంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్బన్‌ సేవింగ్స్‌ పాయింట్ల కోసం విధానపరమైన మార్గదర్శకాలను ఇటీ-వలే రూపొందించారు. ఈ నేపథ్యంలో కార్బన్‌ సేవింగ్స్‌ పాయింట్లను రైల్‌ గ్రీన్‌ పాయింట్స్‌గా సరుకు రవాణా వినియోగదారులకు ప్రకటించాలని యోచిస్తోంది. ఇవి ఎఫ్‌ఓఐఎస్‌ ఈ-ఆర్డీలో నమోదు చేసుకున్న సరుకు రవాణా వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ‘పాప్‌ అప్‌’ ద్వారా సరుకు రవాణా చేయడానికి ఆన్‌లైన్‌(ఈ-డిమాండ్‌ విధానం)లో నమోదు చేసుకున్న ప్రతి వినియోగదారుడికి కార్బన్‌ ఉద్గారాలు ఆదా చేయడంపై సాధించిన రైల్‌ గ్రీన్‌ పాయింట్స్‌ వివరాలను తెలియజేస్తూ భారతీయ రైల్వే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఒకసారి ఆర్‌ఆర్‌ రూపొందించిన తర్వాత, కార్బన్‌ ఉద్గారాల ఆదా వివరాలను రైల్‌ గ్రీన్‌ పాయింట్ల రూపంలో వినియోగదారుల ఖాతాకు జమ చేయడంతోపాటు సరుకు రవాణా వ్యాపార అభివృద్ధి పోర్టల్‌లో కూడా వారి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది.

అంతే కాకుండా రైల్‌ గ్రీన్‌ పాయిట్‌ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం సిస్టంలో కల్పిస్తారు. రైల్‌ గ్రీన్‌ పాయింట్లను ఉపయోగించి రైల్వేల నుంచి ఏ ప్రయోజనాల కోసం క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉండదు కానీ.. రైల్వే ద్వారా మరింత సరుకు రవాణా చేసేందుకు ప్రేరణగా ఉంటు-ంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన ఈ గ్రీన్‌ పాయింట్లు- లెక్కిస్తారు. ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ ద్వారా సమాచారం పొందే వినియోగదారులు ఈ గ్రీన్‌ పాయింట్లు సాధించిన వారి నుంచి ప్రేరణ పొందుతారు. అంతేకాక కార్పొరేట్‌ వినియోగదారులు వారి వార్షిక నివేదికలలో పొందుపరిచి వారి వెబ్‌ సైట్లలో ప్రదర్శించుకోవచ్చు. రైల్‌ గ్రీన్‌ పాయింట్ల సీఆర్‌ఐఎస్‌, ఎఫ్‌ఓఐఎస్‌ ద్వారా రూపొందించడం జరుగుతుంది. రైల్‌ గ్రీన్‌ పాయింట్ల ఆధారంగా గ్రీన్‌ స్టార్‌ రేటింగ్‌ విధానం అభివృద్ధి చేస్తామని, రైల్‌ గ్రీన్‌ పాయింట్లు- లీడర్‌షిప్‌ బోర్డు ద్వారా కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఈ పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ప్రారంభించే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement