Wednesday, May 15, 2024

Raa … kadiliraa – అరాచకాన్ని అడ్డుకుందాం – రాష్ట్రాన్ని కాపాడుకుందాం – చంద్రబాబు

(ఆంధ్రప్రభ స్మార్ట్, రాజమండ్రి ప్రతినిధి ) – రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఒక సైకో, దుర్మార్గుడి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలంటే సైకిల్ ఎక్కి, గాజు గాసుతో ప్రజల వద్దకు వెళ్లి, వాస్తవాలను తెలపండి, రాష్టంలో వైసీపీ ఖాళీ అవుతోంది, మనం గేట్లు ఎత్తితే అక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దూసుకు వస్తారు, రాష్టంలో దళితులు, మహిళలు, బలహీన, బడుగువర్గాలపై దాడులు పెరిగాయి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలంటే జనసేన, టీడీపీకి ఓటు వేయాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో సోమవారం జ‌రిగిన ‘రా.. కదలి రా’ సభలో ప్రసంగించారు.

సైకో వల్లే దుర్మార్గం..
మాచర్లలో ఓ మత్స్యకారుడిని పార్టీ మారాలని పోలీసులు వేధించారని, దీంతో ఆ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని, కేవలం మాచర్లలో మరో చిన్న సైకో వల్లే ఈ దుర్మార్గం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఓ ఉన్మాది, సైకో పాలనలో అంతా అరాచకం సాగుతోందన్నారు. అనంతపురంలో తనకు పెన్షన్ ఇప్పించాలని అభ్యర్థిస్తే అక్కడ మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడని మండిపడ్డారు. అతడి మాట విననందుకు నడిరోడ్డుపై కాళ్లతో తన్నాడన్నారు. ఇక.. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు కన్నాలక్ష్మీనారాయణపై అక్కడి మరో సైకో రాంబాబు దాడి చేయించాడని మండిపడ్డారు. ఇలా రోజు రోజుకూ ఈ ఉన్మాదుల అరాచకాలు పెరిగిపోయాయని, అచ్చోసిన ఆంబోతుల్లా ఊరు మీద పడిన ఈ సైకోలకు తగిన బుద్ది చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది..

ఇక.. ఏపీలో ఎన్నికల ముందే వైసీపీ తుడుచిపెట్టుకుపోతుందని, ఈ పార్టీలో ఉండలేమని ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు జరుగుతోందని చంద్రబాబు అన్నారు. 68 మంది ఎమ్మెల్యేలను తీసివేశారని, ఇందులో 29మందికి సీట్లు ఇవ్వలేదన్నారు. 49 మందిని బదిలీ చేశారని, ఇందులో 11 మంది దళితులు, నలుగురు బీసీలుఉన్నారన్నారు. నలుగురు ఎంపీలను పక్కన పెట్టారని, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారని, ఇప్పడు మనం గేట్లు తెరిస్తే వీరంతా దూసుకు వస్తారని చంద్రబాబు తెలిపారు.

10 మంది మంత్రులకు ముందే ఓటమి..
ఇప్పటికే 10 మంది మంత్రులు ఎన్నికల ముందే ఓడిపోయారని, వీరిలో తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగిరమేష్.. వీరందరూ ప్రజల ముందు ఓడినట్టే అన్నారు. మర్డర్లు చేసినోళ్లను, మద్దతు ఇచ్చినోళ్లకు సీట్లు ఇస్తున్నావా? నీ అవినీతిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని మరో ఎమ్మెల్యే సీఎం జగన్​ని ప్రశ్నించాడన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఎందుకు విచారణ జరిపించరని సీఎం జగన్​ని చంద్రబాబు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు. ఊరూర ఆకుకూరలు దొరకటం లేదు కానీ, గంజాయి మాత్రం దొరుకుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో యువతను గంజాయికి అప్పగించారని ఆరోపించారు.

- Advertisement -

టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తాయి..
జనసేన, తెలుగుదేశం అధికారంలోకి రావటం ఖాయమని, ఏటా నాలుగు లక్షలు చొప్పున ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. అప్పటి వరకూ నెలకు 3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, ఇక వర్క్ ఎట్ హోం విధానం అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇంటిలో బోర్ కొడితే మండల కేంద్రంలో పని చేసుకునే వీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు అన్నీ ఇన్నీ కావని, ఆక్వా రైతును ఆదుకొంటామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జవహర్, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement