Monday, April 29, 2024

ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో ఆర్.నారాయణ మూర్తి భేటీ

పాయకాపురం : నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి సోమవారం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన ‘రైతన్’ చిత్రం మార్చి నెలలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమాను చూడాలని అయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో తెలిపేలా చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతుకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కమిటీ సిఫార్స్‌ లను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్టబద్దత క‌ల్పించిన రోజు రైతు రాజుగా నిలుస్తాడని ఆర్. నారాయణమూర్తి తెలిపారు. సమాజంలో మార్పుకోసం, సామాజిక న్యాయం కోసం అనుక్షణం తపిస్తూ సినిమాలు తీస్తున్న ఆర్‌.నారాయణమూర్తి అంటే ప్రత్యేక అభిమానమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రజాచైతన్యం కోసం, పెట్టుబడి, భూస్వామ్య వ్యవస్థల రద్దు కోసం ఆర్.నారాయణమూర్తి తీసిన ఎన్నో విప్లవాత్మక చిత్రాలు విజయవంతమై ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు.

రైతులను కూలీలుగా మార్చే కేంద్ర చట్టాలను రద్దు చేయాలని నటుడు నారాయణమూర్తి తీసిన రైతన్న సినిమాను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకురావడమే కాకుండా రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వైఎస్సార్ రైతు భ‌రోసా, ఉచిత విద్యుత్, ఉచిత పంట‌ల బీమా ప‌థ‌కం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌గ‌న‌న్న ప్రభుత్వం రైతుల‌ను ఆదుకుంటోంద‌ని చెప్పుకొచ్చారు. రైతులు తమ సొంత కాళ్లపై నిలబడేలా ఈ ప్రభుత్వం వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోందన్నారు. అటువంటి రైతన్నలకు లాభం కలిగించే విధంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రైతు సోదరులతో కలిసి చూస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement