Tuesday, May 7, 2024

కాలేజీ స్టూడెంట్స్‌కి క్విజ్ పోటీలు.. మొదటి బహుమతి లక్ష రూపాయ‌లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక క్విజ్‌ పోటీ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకు ఇలాంటి పోటీ నిర్వహించలేదు. ‘ఏపీఎస్‌సీహెచ్‌ఈ క్విజ్‌ చాంపియన్‌షిప్‌- 2022’ పేరుతో రాష్ట్రంలోని కళాశాలల విద్యార్థులకు ఈ సరికొత్త పోటీ నిర్వహిస్తోంది. ఈ క్విజ్‌లో టాప్‌- 4గా నిలిచిన బృందాలకు వరుసగా రూ. లక్ష, రూ. 60 వేలు, రూ. 30 వేలు, రూ. పది వేలు బహుమతులుగా అందించనున్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలకు అదనంగా ఈ క్విజ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్విజ్‌ పోటీలో పాల్గొనేందుకు ప్రతి విద్యాసంస్థ ఇద్దరు విద్యార్థులతో కూడిన ఒక బృందం వివరాలను ఉన్నత విద్యామండలికి పంపాల్సి ఉంటుంది. క్విజ్‌ను ఐదు దశల్లో ‘ఎలిమినేషన్‌, క్వాలిఫయర్స్‌, క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌గా నిర్వహించనున్నారు. ఎలిమినేషన్‌ కోసం బృందాలన్నింటికీ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచిన 40 బృందాలను క్వాలిఫయర్స్‌కు ఎంపిక చేస్తారు.

అనంతరం క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీస్‌, ఫైనల్స్‌ పోటీలను గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్‌ 20, 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పోటీలకు వచ్చే విద్యార్థులకు అవసరమైన వసతి సదుపాయాలను ఉన్నత విద్యామండలి కల్పిస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26(శనివారం) ఉదయం పది గంటల నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. క్విజ్‌ నోటిఫికేషన్‌ కోసం, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపడం కోసం ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఏపీఎస్‌సీహెచ్‌ఈక్విజ్‌చాంపియన్‌షిప్‌2022.పీడీఎఫ్‌, క్విజ్‌.పీహెచ్‌పీ సందర్శించాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement