Friday, April 26, 2024

రోడ్లపై మందుబాబుల చిందులు..!

మద్యం దుకాణాల వద్ద నిత్యం న్యూసెన్స్
రాత్రి 8 గంటల తరువాత రోడ్లపైకి రావాలంటేనే భయం
గిద్దలూరు : మందు తాగుతాం.. కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం.. అడ్డొస్తే మిమ్మల్ని కొడతాం.. అంతా మా ఇష్టం.. అడిగేందుకు మీరెవరు.. అంటూ మందుబాబులు రెచ్చిపోతున్నారు. రాత్రి 8 గంటలు దాటితే గిద్దలూరు పట్టంలోని మద్యం షాపుల వద్ద నిత్యం ఇదే పరిస్థితి.. రాత్రి 8 గంటల తరువాత రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు ముఖ్యంగా మహిళలు భయపడుతున్నారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లోని మద్యం షాప్ ల వద్ద రోడ్డుపైనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. స్థానికులు వారిని వారించేందుకు ప్రయత్నించగా వారిపైనే తిరగబడ్డారు. అంతా మా ఇష్టం అంటూ న్యూసెన్స్ చేస్తూ అక్కడివారిని భయ భ్రాంతులకు గురిచేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం మందుబాబులు మద్యం తాగి చిందులు వేస్తూ కొట్టుకోవడం.. కేకలేయడం మామూలుగా మారిపోయిందని పట్టించుకునేవారు లేకుండాపోయారని పలువురు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8గంటల తరువాత వివిధ గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు, మహిళలు కోమరోలు బస్టాండ్ వద్ద బస్సుల కోసం వేచి ఉంటూ మందుబాబుల వీరంగం చూసి భయాందోళనకు గురవుతున్నారు. గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్ సెంటర్, కుమ్మరణకట్ట, గాంధీబొమ్మ సెంటర్ లలోని ప్రధాన రోడ్లపైనే మద్యం షాప్ లు ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. పోలీసులు అడపా దడపా హెచ్చరిస్తున్నప్పటికి మందుబాబులు మద్యం మత్తులో మేమింతే.. ఎవరి మాట వినం.. అంటూ మందుబాబులు ఊగిపోతున్నారు. మందుబాబుల ఆగడాలకు ప్రజలు చిర్రెత్తిపోతూ విమర్శిస్తున్నారు. ఇప్పటి కైనా పోలీసులు ప్రజల ఇబ్బందులు దృష్టిలో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement