Friday, September 22, 2023

పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన – జగన్

విజయనగరం – ‘పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి’ అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో నిరుపేదల పిల్లల ఉన్నత చదువుల బాధ్యతను తాము తీసుకున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది అని అన్నారు. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తాం అని చెప్పుకొచ్చారు. ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదవాడికి మంచి చేస్తే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు అని సీఎం వైఎస్ జగన్ విద్యార్థులతో అన్నారు.

ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టామనని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా వేగంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు..

ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ ముచ్చటించారు. ‘దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరుకోవాలి’ అని సీఎం జగన్ విద్యార్థులకు తెలియజేశారు. స్వతంత్య్రం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలే ఉన్నాయి. అందుకే ఈ 11 మెడికల్‌ కాలేజీలకు మరో 17 మెడికల్‌ కాలేజీలను చేర్చి 28 మెడికల్‌ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్‌ కాలేజీ ఉండబోతోంది అని చెప్పుకొచ్చారు. ఇవాళ ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించుకున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తాం. ఈ 17 మెడికల్‌ కాలేజీలు వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తంగా ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు చేరుతుంది. ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి డాక్టర్లు అయ్యి ప్రజలకు ఉపయోగపడాలి. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్నా. అందుకే ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదు అని సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల నుంచి కోరారు. రాబోయే రోజుల్లో వెనకబడిన ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీలు వస్తాయి. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్యసదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ఉండనుందని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చాం. హెల్త్‌ సెక్టార్‌లో 53 వేలమందిని రిక్రూట్‌ చేశాం. కొత్తగా 18 నర్సింగ్‌ కాలేజీలను తీసుకొస్తున్నాం. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తాం. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని సీఎం జగన్‌ వివరించారు.

.ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఉపముఖ్యమంత్రి ,గిరిజన సంక్షేమశాఖ, పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి , పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖbబూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎం.టీ కృష్ణబాబుతో పాటు పలువులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement