Saturday, May 4, 2024

పోలీస్‌ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు.. రైతు కన్నీరు తుడవలేక రగడ : నాగబాబు..

అమరావతి, ఆంధ్రప్రభ: శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్న పోలీస్‌ వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. జీతభత్యాల మీద ఆధారపడే ఉద్యోగులను వేధించడం మానుకోవాలని సూచించారు. రైతాంగం, ఉద్యోగులు, ప్రజా సమస్యల పరిష్కారం, తదితర అంశాలపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్‌ శాఖలోని ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతభత్యాలు సకాలంలో అందడం లేదని తెలిసిందని, పోలీస్‌ ఉద్యోగి కుటు-ంబ సభ్యుడిగా సకాలంలో జీతభత్యాలు అందక ఎదురయ్యే సమస్యలు తెలుసని, కాబట్టే అలాంటి సమస్యలు మరొకరికి రాకూడదని ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నామని స్పష్టతనిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకు రాజ్యాధికారం అప్పజెప్పాలని, పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే భావన ప్రజలందరి నుంచి వ్యక్తమవుతోందని నాగబాబు పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం కోసం చివరి శ్వాస వరకు జనసైనికుడిగా పని చేస్తానని, పార్టీ నిర్మాణం కోసం రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి రావడానికైనా సిద్ధంగా ఉన్నానని, జనసైనికులు, వీర మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగొద్దని పిలుపునిచ్చారు. ఇకనుంచి తాను ప్రతి జనసైనికుడికి, వీరమహిళకు అందుబాటులో ఉంటానని, అత్యవసర సమయాల్లో అవసరమనుకుంటే తనను సంప్రదించవచ్చనే ధైర్యానిచ్చారు.

అవినీతి, అరాచకాలను కప్పిపుచ్చడానికే వైసీపీ రగడ..

ప్రజా సమస్యలు, రైతాంగం కష్టాల గురించి తాము మాట్లాడుతుంటే వ్యక్తిగత జీవితాల గురించి ఆరోపణలు చేస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న తీరును, ప్రజాప్రయోజన వ్యవహారాల్లో ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చడానికే మంత్రులు ఇష్టానుసారంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ గురించి దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం అవినీతి, అరాచకాల వైపు ప్రజలు దృష్టిపెడితే తమ బండారం బయట పడుతుందని ప్రజల దృష్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ మీదకు మరల్చే విధంగా, సీఎం, మంత్రిగణం చేస్తున్న ప్రయత్నాలకు సరైన సమయంలో సమాధానం చెబుతామన్నారు.

పవన్‌ కల్యాణ్‌ జీవితం తెరిచిన పుస్తకమని అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజాజీవితం కోసం, ప్రజా చైతన్యం కోసం, ప్రజలతో మమేకమై పని చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడడం వైసీపీ అహంకారానికి నిదర్శనమన్నారు. వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తే భయపడతారని, ప్రశ్నించే వారు, ఎదురించే వారే ఉండరనుకుంటే కుదరదని, ఆ రోజులు పోయాయని నాగబాబు హితవు పలికారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement