Thursday, April 25, 2024

ఎంసెట్‌ ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్‌ అడ్మిషన్లు.. సీటు కావాలంటే ఎంసెట్‌ రాయాల్సిందే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాబోయే విద్యా సంవత్సరం 2022-23 నుంచి బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల కోర్సు సీట్లను ఎంసెట్‌ ఎంట్రెన్స్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రస్తుతం ఇంటర్‌ మార్కుల ఆధారంగా బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ భర్తీ చేస్తుండగా ఇక నుంచి ఎంసెట్‌ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌ పరీక్షను తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. అయితే కాళోజీ ఆరోగ్య వర్సిటీ పంపించిన ప్రతిపాదనల మేరకు బీఎస్సీ నర్సింగ్‌ అడ్మిషన్లను ఎంసెట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి బైపీసీ విద్యార్హతగా నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఎంసెట్‌ ఆధారంగా భర్తీ చేయనుండగా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను నీట్‌ మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు.

బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలను ఎంసెట్‌ ద్వారా చేపట్టేందుకు యూనివర్సిటీ ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలికి లేఖ రాసిన నేపథ్యంలో ఈమేరకు నిర్ణయంతీసుకున్నారు. ఎంసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే బైపీసీ విద్యార్థులు చాలా మంది అగ్రికల్చర్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నర్సింగ్‌ చేయాలనుకునే వారికి ఎడిట్‌ ఆప్షన్‌ను త్వరలోనే ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మొత్తం 90 నర్సింగ్‌ కాలేజీలు ఉండగా, అందులో 9 ప్రభుత్వ కాలేజీలు, 81 ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలున్నాయి. 9 ప్రభుత్వ కాలేజీల్లో 680 కన్వీనర్‌ కోటా సీట్లు ఉండగా, 81 ప్రైవేట్‌ కాలేజీల్లో 4620 సీట్లు ఉన్నాయి. ఈ ప్రైవేట్‌ కాలేజీల్లోని మొత్తం సీట్లల్లో 60 శాతం కన్వీనర్‌ కోటా, 40 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి తెలిపారు. కాగా, జూలై 14 నుంచి 20 వరకు ఎంసెట్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement