Wednesday, May 1, 2024

AP : పరవాడలో ఫార్మా బాంబు..!

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఆల్కలీన్ మెటల్, అరబిందోలో ఒక్కొక్కరు
ఐదుగురి పరిస్థితి విషమం
వరుస ప్రమాదాలపై భయాందోళనలో జనం

(ఆంధ్రప్రభ, విశాఖ క్రైం/పరవాడ) : విశాఖ పరిశ్రమలలో వరుసఅగ్ని ప్రమాదాలతో కార్మికులు బెంబేలెత్తుతున్నారు. ఈ సీరియల్ యాక్సిడెంట్లతో .. క్షణక్షణం ఏమి జరుగుతుందోనని స్థానిక ప్రజలుప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో వేర్వేరు ఫార్మా కంపెనీల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ వరుస ప్రమాదాలు జనంలో కలకలం రేపింది. కలవరం సృష్టించాయి.

- Advertisement -

జవహర్ లాల్ ఫార్మాసిటీలో ఆల్కలీన్ మెటల్స్ యూనిట్ 3 ఓ మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీక్ కావటంతో ఆరుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుత్రికి తరలిస్తుండగా సీహెచ్ రమణ అనే కార్మికుడు మృతి చెంచాడు. మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ కొన్నేళ్లుగా ఆల్కలీన్ మెటల్స్ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. రమణకి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మిగిలిన ఐదుగురు వ్యక్తులలో ముగ్గురు తీవ్ర గాయాలతో అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు గాజువాకలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక అరబిందో ఫార్మా కంపెనీ అనుబంధ కంపెనీ ఎఫ్టోరియా యూనిట్-6లో రియాక్టర్ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆళ్ల గోవిందా (32) తీవ్రంగా గాయపడగా అగనంపూడి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కార్మికుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ కంపెనీలో ఇది మూడో ప్రమాదం
ఆల్కలీన్ మెటల్ కంపెనీలో ఇది మూడో ప్రమాదంగా చెబుతున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడంతో ఫార్మా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదాలపై ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, కాలుష్యంతో జనం అల్లాడిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement