Tuesday, May 14, 2024

AP | నూజివీడు టౌన్‌షిప్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..

అమరావతి, ఆంధ్రప్రభ: మధ్యతరగతి వర్గాల ఆదాయ సమూహాలకు నిర్దేశించిన నూజివీడు ఎంఐజీ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్లాట్ల విక్రయ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. ఏపీ సీఆర్డీఏ చేపట్టిన ఎంఐజీ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో ఒక్కో చదరపు గజం ధర రూ.8,500గా ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో 150, 200, 250 గజాలతో కొత్త లే అవుట్‌ ఏర్పాటయింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏపీ సీఆర్డీఏ 26.88 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

సులభవాయిదాల పద్ధతిలో నగదు చెల్లించుకునే బృహత్తర అవకాశాన్ని కల్పిస్తోందని కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ శనివారం మీడియాకు వివరించారు. మధ్యతరగతి ప్రజలు సౌకర్యవంతంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయం మేరకు ఏలూరుజిల్లా నూజివీడు పట్టణంలోని ఎంఆర్‌ అప్పారావు కాలనీలో స్మార్ట్‌ టౌన్‌షిప్‌ రూపుదిద్దుకుంటోందని వివరించారు. నూజివీడు ఆర్టీసీ బస్టాండుకు దగ్గరలో మ్యాంగో గార్డెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ చెంతన 40.78 ఎకరాల విస్తీర్ణంలో 393 ప్లాట్లతో ఎంఐజీ నూతన లే అవుట్‌ ను ఏర్పాటు చేశామన్నారు.

మధ్య తరగతి ప్రజలు ఎంఐజీలో ప్లాట్లు విరివిగా కొనుగోలు చేసుకోవాలని సదాలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా 60-80 అడుగుల వెడల్పుతో ప్రధాన తారురోడ్లు, 40 అడుగుల వెడల్పుతో అంతర్గత సిమెంటు రోడ్లు నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రత్యేక మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీటి వ్యవస్థను నిర్మిస్తారు. మురునీటిశుద్ధి ప్లాంటు.. జనాభా అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా వ్యవస్థ.. విశాలమైన పార్కులు, వాకింగ్‌ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు.

- Advertisement -

సులభతర వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు వెసులుబాటు కల్పించామని కమిషనర్‌ పునరుద్ఘాటించారు. నికర అమ్మకం ధరలో 10 శాతం మొత్తాన్ని చెల్లించి ఎంపిక చేసుకున్న పరిమాణం గల ప్లాటును బుక్‌ చేసుకునే వీలుందన్నారు. సీఆర్డీఏకు వచ్చిన దరఖాస్తులను స్కూట్రినీ చేసి ఈ-లాటరీ నిర్వహిస్తామన్నారు. ఎంపికైన లబ్ధిదారునికి 24 గంటల లోపు ఏపీ సీఆర్డీఏ ప్లాటు కేటాయింపు పత్రాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. ప్లాటు కేటాయించిన నెల లోపు లబ్ధిదారులు అగ్రిమెంటు పూర్తి చేసుకోవాలన్నారు.

తదుపరి నెలలో నికర అమ్మకపు ధరలో 30 శాతం సొమ్మును, 180 రోజుల లోపు అమ్మకపు ధరపై మరో 30 శాతాన్ని, 360 రోజుల లోపు అమ్మకపు ధరపై మరో 30 శాతం కలిపి మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏడాది కాలంలో వాయిదాలు చెల్లించిన తరువాత ప్లాటు-కు రిజిస్ట్రేష్రన్‌ పూర్తిచేసి కొనుగోలుదారుకు పత్రాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం లే అవుట్లోని 10 శాతం ప్లాట్లు- రిజర్వుడు చేసి ప్లాటు- ధరలో 20 శాతం రాయితీ కల్పిస్తున్నది. అదే నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ రి-టైర్డ్‌ ఉద్యోగుల కోసం 5 శాతం ప్లాట్లు- రిజర్వు చేశామని ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల గడువును పొడిగించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement