Monday, May 6, 2024

AP: ట్రాన్స్​ఫర్ల గురించి టెన్షన్​ వద్దు.. ఎక్కడైనా పనిచేసేలా డాక్టర్లు ఉండాలి: మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ

ప్రభుత్వంలో ప‌నిచేస్తున్న డాక్టర్లందరూ ఎంతో అదృష్టవంతుల‌ని, ఒక గొప్ప ప్రభుత్వంలో వైద్య సిబ్బంది ప‌నిచేస్తున్నార‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని అభిప్రాయపడ్డారు. గుంటూరు క‌లెక్టరేట్‌లోని శంక‌రన్ హాలులో శ‌నివారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వైద్య విభాగంపై స‌మీక్ష నిర్వహించారు. దాదాపు 4 గంట‌ల‌పాటు ఈ సమావేశం కొనసాగింది. సమీక్షలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ.. వైద్య రంగంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక‌మైన స్థానం ఉందన్నారు. గుంటూరు మెడిక‌ల్ క‌ళాశాల‌లో చ‌దువుకున్న ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాత వైద్యులుగా సేవ‌లు అందిస్తున్నార‌ని చెప్పారు. వైద్య రంగంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇదే జిల్లా నుంచి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. వైద్యారోగ్యశాఖ కోసం సీఎం జ‌గ‌న్ ఏటా రూ.13 వేల కోట్లు ఖ‌ర్చుచేస్తున్నార‌ని తెలిపారు.

నాడు-నేడు కింద ఆస్పత్రుల నిర్మాణం కోస‌మే ఏకంగా త‌మ ప్రభుత్వం రూ. 16వేల కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని మంత్రి రజని చెప్పారు. ఈ స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ‌కు నిధులు కేటాయించిన ప్రభుత్వాలు గ‌తంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. దాదాపు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప‌దోన్నతుల ఫైళ్లకు బూజు దులిపిన ఘ‌త‌న జ‌గ‌న‌న్నకే ద‌క్కుతుంద‌ని తెలిపారు రజినీ. ఏ ప్రభుత్వ వైద్య సంస్థ కూడా ఇన్‌చార్జిల పాల‌న‌లో ఉండ‌కూడ‌ద‌ని నేరుగా అన్ని అర్హత‌లున్నవారినే సూప‌రింటెండెంట్‌లుగా, వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిప‌ల్స్‌గా నియ‌మిస్తున్నామ‌ని చెప్పారు. ఎక్కడా నిబంధ‌న‌లు స‌డ‌ల‌కుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంద‌న్నారు.

గుంటూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌గాని, గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ప్రిన్సిప‌ల్‌గాని దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత ఇన్‌చార్జీలు కాకుండా అన్ని స్థాయి అర్హత‌లు ఉన్నవారే పూర్తిస్థాయి బాధ్యత‌లు స్వీక‌రించారని మంత్రి రజనీ గుర్తు చేశారు. అంటే త‌మ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవ‌చ్చని వివ‌రించారు. ప్రభుత్వంఎన్ని కోట్ల నిధులు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది బాగా ప‌ని చేస్తేనే ఆ ఫ‌లాలు ప్రజ‌ల‌కు స‌మ‌ర్థవంతంగా చేర‌తాయ‌ని చెప్పారు రజినీ. అయితే.. ఇక్కడ ఉన్నవారంతా వైద్యులేన‌ని, అంతా ఎంబీబీఎస్ చ‌దువుకున్నవాళ్లేన‌ని మంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వ‌స్తే.. అక్కడికి వెళ్లి చ‌దువుకున్న వారంతా.. విధులు విష‌యంలో ఎందుకు ఒకే ప్రాంతాన్ని కోరుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement