Sunday, May 5, 2024

కొత్త రకం తామర తెగులు మిర్చి పంటను నాశనం చేసింది.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ న‌ష్టం: కేంద్ర వ్యవసాయ శాఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆగ్నేయాసియా దేశాల నుంచి భారత్ చేరుకున్న ‘థ్రిప్స్’ జాతి పురుగు కారణంగా ఏర్పడ్డ కొత్త రకం తామర తెగులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిర్చి పంటను నాశనం చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల్లో 40 నుంచి 80 శాతం మేర పంట దెబ్బతిన్నట్టు పేర్కొంది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక జవాబిచ్చిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మిర్చి పంటను ఆశించిన కొత్త తెగులుపై ‘డైరక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ & స్టోరేజి’, ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్’, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీ, ఉద్యానవన శాఖ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించినట్టు వెల్లడించారు.

కమిటీ అధ్యయనంలో 40 – 80 శాతం పంట నష్టం వాటిల్లినట్టు తేలిందని వివరించారు. థ్రిప్స్ జాతి పురుగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో మరింత బలపడి, మిర్చి పంటను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. మరోవైపు వీటి బెడద నుంచి పంటను కాపాడాలన్న ఉద్దేశంతో రైతులు విచ్ఛలవిడిగా క్రిమి సంహారక మందులు ఉపయోగించారని, దీంతో థ్రిప్స్ జాతికి సహజ శత్రువులైన ఇతర కీటకాలు కూడా నశించి, అనూహ్య రీతిలో థ్రిప్స్ మరింత విస్తరించడానికి దోహదపడ్డట్టయిందని విశదీకరించారు. చివరకు చేతులెత్తేసిన రైతులు పంటలను అలాగే వదిలేశారని, దీంతో ఆరోగ్యవంతమైన ఇతర మిర్చి తోటల్లోకి సైతం ఈ పురుగు ఆక్రమించి, నాశనం చేసిందని తెలిపారు.

పరిష్కార మార్గాలు..

భారీస్థాయిలో పంటనష్టాన్ని కల్గిస్తున్న ఈ కొత్త రకం తామర తెగులు నుంచి బయటపడేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తోందని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. జిల్లా స్థాయిలో పెస్ట్ సర్వే నిర్వహించడంతో పాటు పంటలను నాశనం చేసే పురుగులు, క్రిమికీటకాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించింది. మిర్చి సాగు చేసే పొలాల్లో భూసారాన్ని పెంచే చర్యలు చేపట్టాలని, నాణ్యమైన పురుగుమందులు, సేంద్రీయ క్రిమినాశక పదార్థాలు ఉపయోగించాలని, రసాయనాలతో కూడిన ఎరువులు వాడకాన్ని తగ్గించడంతో పాటు రైతుల్లో అవగాహన పెంచాలని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తోమర్ వెల్లడించారు.

అలాగే వేసవిలో లోతుగా దున్నడం, వానాకాలం (ఖరీఫ్) – యాసంగి (రబీ) పంటల మధ్య వేసవిలోనూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, సమతూకంలో ఎరువుల వాడకం, పంట వ్యర్థాలను పూర్తిగా నాశనం చేయడం, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వ్యూహాలతో పంటలను నాశనం చేసే కీటకాలను ఎదుర్కోవాలని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రైతు భరోసా కేంద్రంలో 2-3 ఎకరాల స్థలంలో ‘తోట బడి’ (రాష్ట్ర ప్రభుత్వ పథకం) ద్వారా రైతుల్లో అవగాహన, భరోసా నింపే ప్రయత్నాలపై కూడా చర్చించామని కేంద్ర మంత్రి తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ థ్రిప్స్ గా చెప్పుకునే ఈ కొత్త రకం పురుగు మిర్చితో పాటు మునగ, బొప్పాయి, మామిడి తదతర పంటలకు కూడా ఆశించి, నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో విదేశాల నంచి దిగుమతి చేసుకునే వివిధ మొక్క జాతుల విషయంలో కఠినమైన ప్లాంట్ క్వారంటైన్ విధానాలు అవలంబించాలని సూచించినట్టు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement