Wednesday, May 8, 2024

తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం, పొత్తులపై ఆసక్తి.. జనసేనాని తాజా ప్రకటనతో జోష్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా రెండుళ్ల సమయం ఉండగానే కధన రంగంలో కాలుదువ్వుతున్న పార్టీలు చేస్తున్న ప్రకటనలు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమదైన వ్యూహంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తూ దూకుడు పెంచాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అధికార పీఠంపై దృష్టిసారించాయి. ముఖ్యంగా 2024 ఎన్నికలు టీడీపీకి చావో, రేవో లాంటిది కావడంతో అధిష్టానం సర్వశక్తులను ఒడ్డుతూ పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పొత్తులపై చేసిన ప్రకటన తెలుగు తమ్ముళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వమని అవసరమైతే పొత్తులకు సైతం సిద్ధమని జనసేన ఆవిర్భావ సభలో ఇప్పటికే ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా మరోసారి పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైకాపాను గద్దె దింపాలంటే రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పనిసరని దీనిని తమ మిత్రపక్షమైన బీజేపీ అధిష్టానం కూడా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రకటన తెలుగు తమ్ముళ్లను ఆశల పల్లకిలోకి నెట్టింది. ఇంకోకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పొత్తులపై ఇటీవల జిల్లా పర్యటనలో మాట్లాడారు. వైకాపాను అధికారం నుంచి దూరం చేసేందుకు ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఐక్య పోరాటానికి కలిసి రావాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. స్వయంగా పార్టీ అధినేత ఈ విధమైన ప్రకటన చేసి దిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇచ్చిన సంకేతాలపై పార్టీ వర్గాలు, కేడర్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో పొత్తు లేకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ స్వల్ప తేడాతో సీట్లను కోల్పోయింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ఈ విధంగా పార్టీ పరాజయం పాలైనట్లుగా తెదేపా నేతలు గతంలోనే అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా పట్టణాల్లో అధికార పక్షానికి ఎదురు గాలి వీస్తుందని, గ్రామాల్లో మాత్రం ఆ పార్టీకి మెరుగైన ప్రజాధారణ ఉన్నట్లుగా తెదేపా నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ఓట్‌ బ్యాంక్‌ను ఆకర్షించాలంటే జనసేనతో ముందుకు సాగడం మంచిదన్న అభిప్రాయం కేడర్‌ నుంచి వినపడుతోంది. ఉమ్మడి వ్యూహంతోనే ముందుకు వెళితేనే వైకాపాను గద్దె దించగలమన్న అభిప్రాయం జనసేన, తెదేపా కార్యకర్తలు, నేతల నుంచి స్పష్టమవుతోంది.

కొందరు నేతల్లో గుబులు..
ఇదిలా ఉంటే పొత్తులపై వెలువడుతున్న ప్రకటనలు కొందరు తెలుగుదేశం నేతల్లో గుబులును రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉండగానే పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో కొంత ఆందోళనకు లోనవుతున్నారు. జనసేన, బీజేపీతో కలిసి ముందుకు నడిస్తే తమ నియోజకవర్గాలలో పోటీచేసే అవకాశం ఎక్కడ చేజారుతుందోనన్న భయం వారిని వెన్నాడుతోంది. ఇంతకాలం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించడంతో పాటు కేసులను ఎదుర్కొన్న తాము పొత్తులతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే మరికొందరు నేతలు ముఖ్యంగా కేడర్‌ మాత్రం ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించాలంటే పొత్తులు తప్పనిసరని అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తే తాము సిద్ధమని చెబుతున్నారు. అయితే పొత్తులకు ఇంకా సమయం ఉందని దీనిపై తమ పార్టీ అధిష్టానం అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం ముఖ్యనేతల నుంచి వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement