Sunday, May 19, 2024

అస్తవ్యస్త ప్రజాపంపిణీతో ఆకలితో పేదలు


మర్రిపాడు – వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా వాహనాలతో సరఫరా చేసేందుకు నూతన వ్యవస్థ రూపకల్పన చేసింది. కానీ ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పి అస్తవ్యస్తంగా మారింది .ఇందుకు అధికారుల ఉదాసీనత తోడైంది. దీంతో ఆకలితో పేదలు అవస్థలు పడుతూ ఎన్ని రోజులు పస్తులు ఉండాలి ఏంటి ఇదేనా ప్రజా పాలన అంటూ పేదలు వృద్ధులు వితంతువులు అధికారులు, డీలర్ల పై నిప్పులు చెరుగుతున్నారు. ఈనెల 12వ తేది ముగుస్తున్న రేషన్ బియ్యం నిత్యావసర సరుకులు గ్రామాలకు సరఫరా చేయకపోగా సరఫరా చేసిన గ్రామాల్లో కూడా బియ్యం పంపిణీ చేయకపోవడం డీలర్ల చుట్టూ నిరుపేదలు తిరుగుతున్న వారు సమాధానం చెప్పకపోవడంతో ఆవేదన చెందుతున్నారు . వాహనదారులు కరోనా సాకు చెబుతూ బియ్యం పంపిణీ చేయడానికి రావడం లేదని విమర్శలు చేస్తున్నారు. వేలిముద్రలు మేము వేస్తాం మీరు బియ్యం పంపిణీ చేయండంటూ వాహనదారులు డీలర్లకు చెప్పడంతో జీతం మీరు తీసుకుంటూ బియ్యం పంపిణీ మేమెందుకు చేయాలని నిరాకరించినట్లు తెలుస్తోంది. వాహనదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతి నెల 26000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నా పంపిణీ చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మర్రిపాడు మండలం లో ఎక్కువ మంది పేదలు ఉండడంతో కేవలం రేషన్ బియ్యం పైన ఆధారపడి వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టిలో పెట్టుకొని ప్రతినెలా క్రమం తప్పకుండా గతంలో లాగే ఒకటో తేదీ నుంచి 20వ తేదీ లోపు బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై మర్రిపాడు తాసిల్దార్ ఎస్కే అబ్దుల్ హమీద్ వివరణ కోరగా కోవిడ్ కారణంగా పంపిణీ చేయడం ఆలస్యం అవ్వడం వాస్తవమే అని త్వరగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement