Thursday, May 2, 2024

తిరుపతి ఉప ఎన్నిక లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు రూరల్ ప్రభన్యూస్ – తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను 7 నియోజకవర్గాల్లో 2470 పోలింగ్ స్టేషన్స్ లో ప్రశాంతంగా నిర్వహించామని..,రెండో తేదిన జరిగనే కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ & రిటర్నింగ్ అధికారి కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన కలెక్టర్.., నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నెల్లూరు నగరంలోని డి.కె.డబ్య్లూ కళాశాలలో జరుగుతుందని, చిత్తూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ తిరుపతిలోని ఎస్.వి.విశ్వవిద్యాలయంలోని కళాశాలలో జరుగుతుందన్నారు. కౌంటింగ్ సూపర్ వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అందరికీ తగిన శిక్షణ అందించామని, కౌంటింగ్ ప్రక్రియ రెండో తేది ఉదయం 8.00 గం. ప్రారంభమవుతుందన్నారు. మొదట సర్వీసు ఓటర్లకు ఆన్ లైన్ ద్వారా పంపించిన ఈ.టి.పి.బి.ఎస్. ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, ఆ తర్వాత ఈ.వీ.ఎం మిషన్లలోని ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధుల్లోని సిబ్బంది, ఎన్నికల సంఘం పాసులు జారీచేసిన జర్నలిస్టులు అందరూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికేట్ ని గానీ, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి 48 గం. ముందు కోవిడ్ పరీక్ష నిర్వహించుకుని, నెగటివ్ రిపోర్టుకు సంబంధించిన పత్రాలను అందిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ పి.పి.ఈ కిట్ తప్పక ధరించాలని, కౌంటింగ్ సిబ్బంది ఫేస్ షీల్ట్, మాస్కు ధరించి కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రంలోనూ హైపోక్లోరైడ్ ద్రావణంతో ప్రతి 3 గం. శానిటైజ్ చేస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అత్యధికంగా 25 రౌండ్లు ఉండబోతున్నాయని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 8 టేబుల్స్ లో ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ.వి.ఎం మిషన్ల ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేసిన ప్రతి టేబుల్ కి కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత ర్యాండమ్ గా రెండు ఈ.వి.ఎం మిషన్లలోని ఓట్లను మరోసారి లెక్కిస్తామని.., ఈ ఓట్ల లెక్కింపును కౌంటింగ్ అబ్జర్వర్ పరిశీలించి, సరిచూసిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలు అందించడానికి కమ్యూనికేషన్ రూం, మీడియా రూంను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశామని.., తిరుపతి లోక్ సభ స్థానానికి సంబంధించిన 7 నియోజకవర్గాల కౌంటింగ్ ఫలితాలు నెల్లూరు నగరంలోని డి.కె.డబ్య్లూ కళాశాలలోనే రౌండ్ల వారీగా వెల్లడిస్తామన్నారు. కౌంటింగ్ నిమిత్తం ఇద్దరు అడిషనల్ అబ్జర్వర్లను ఎన్నికల సంఘం నియామకం చేసిందన్నారు. ఇద్దరు కౌంటింగ్ అబ్జర్వర్లు, ఇద్దరు అడిషనల్ అబ్జర్వర్లు మొత్తం నలుగురు కౌటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకూ నో మాన్ జోన్ గా పరిగణిస్తూ..ఔటర్ రింగ్ లో సివిల్ పోలీసులు, ఇన్నర్ రింగ్ లో ఆర్మ్‌డ్ పోలీసు సిబ్బంది, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ రూంల వద్ద కేంద్ర బలగాలు ఉంటాయన్నారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత గెలిచిన అభ్యర్థితో పాటు.., మరో ఇద్దరు మాత్రమే ఆర్.ఓ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారిని కలవడానికి ఎన్నికల సంఘం అనుమతించిందని.., కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఇప్పటికే ఈ నిబంధనలను రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు లిఖిత పూర్వకంగా అందించామన్నారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, దీనిని అందరూ గమనించాలని.., మే 2న కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత 4వ తేదీ వరకూ ఎన్నికల నియమావళి రెండు జిల్లాల్లోనూ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, డి.ఎఫ్.ఓ షణ్ముఖ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement