Thursday, May 2, 2024

Navataram – జనసేన – టీడీపీ పొత్తు అవశ్యకత గురించి బిజెపి పెద్దలకు ముందే చెప్పా.. పవన్ కల్యాణ్

పొలిపల్లే – టీడీపీ అధినేత చంద్రబాబు. ని జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు జన సేనాని పవన్ కల్యాణ్ . రాజకీయాలలో చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన టీడీపీ యువగళం నవశకం సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు.గతంలో కేంద్రంలోనూ గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. చంద్రబాబు నాయుడిపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మద్దతు తెలపాలనుకున్నానని చెప్పారు .జగన్ చేసిన తప్పులకు ఆయనను సోనియా గాంధీ జైల్లో పెట్టించారని పవన్ అన్నారు. ఆ కక్షను జగన్ ఇప్పుడు చంద్రబాబుపై చూపటం అన్యాయమని వ్యాఖ్యానించారు. తాను కష్టాలు చూసిన వాడినని, అనుభవించిన వాడినని చెప్పారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తమలో ఉందని తెలిపారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర గురించి పవన్ మాట్లాడుతూ., . “నేను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదు. పాదయాత్ర వల్ల చాలామంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా. లోకేశ్ యువగళం పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉంది” అని వివరించారు.

మేం విడిపోయిన ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది!

రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆనాడు టీడీపీ సంకీర్ణానికి మద్దతు ఇచ్చాను. అప్పట్లో ఒక దశాబ్ద కాలం పాటు అండగా నిలుద్దామని భావించాను. దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాలవల్ల 2019లో ముందుకు తీసుకెళ్లలేకపోయాను. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది. దశాబ్ద కాలం పాటు రాష్ట్ర పీఠంపై సుదీర్ఘ రాజకీయ నేత ఉంటే బాగుంటుందని భావించాను, దురదృష్టవశాత్తు మిస్ అయ్యాం. 2024లో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం, మార్పు తెస్తున్నాం, జగన్ ను ఇంటికి పంపించడం ఖాయం. పాతికమంది ఎమ్మెల్యేలను మార్చారు, మరో 80 మందిని మారుస్తారని విన్నాను, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు… ముఖ్యమంత్రి జగన్ ని అని వ్యాఖ్యానించారు.

నాకు జగన్ పై వ్యక్తిగత కక్షలేదు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఎదురు తిరిగితే కేసులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందని భావించలేదు. మేము ఒక రాజకీయపార్టీగా, ఆయన ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు చెప్పాం, ఆయనకు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదు. మేం ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తే నీచంగా తిట్టించడం దారుణం, దశాబ్దాల రాజకీయ జీవితంలో వైఎస్ కూడా ఆడపడుచులను, ఇంట్లోంచి బయటకు రాని వ్యక్తులను విమర్శించలేదు, ఇది ఏం రాజకీయం? అంటూ పవన్ ప్రశ్నించారు.

- Advertisement -

ఈ పొత్తుకు మీ ఆశీస్సులు కావాలని బీజేపీ పెద్దలను కోరాను

బీజేపీని మోసం చేశానని నన్ను వైసీపీ నేతలు విమర్శించారు. అయితే నేను ఏపీ పరిస్థితులను బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించాను. టీడీపీ-జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్ షాకు తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియదు. రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైంది. పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నాతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బీజేపీ కేంద్రనాయకత్వానికి చెప్పాను. జనసేన ఆలోచన విధానంపై లోకేశ్ తో మాట్లాడాను. భవిష్యత్తులో ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తాం. చంద్రబాబు, నేను కలిసి రానున్న రోజుల్లో భారీ సభ ఏర్పాటుచేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. ఇది లోకేశ్ సభ కాబట్టి కుదించి మాట్లడుతున్నాను. నేను ఆలోచిస్తున్నది 5 కోట్లమంది రాష్ట్ర భవిష్యత్తు తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ఈ మైత్రి, ఈ స్ఫూర్తి చాలా సంవత్సరాలు కొనసాగాలని ఆశిస్తున్నాను. హలో ఏపీ… బైబై వైసీపీ… టీడీపీ-జనసేన మైత్రి వర్థిల్లాలి” అంటూ పవన్ తన ప్రసంగం ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement