Friday, May 3, 2024

Yuva Galam వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడమే టీడీపీ – జన సేన లక్ష్యం .. చంద్రబాబు

పోలిపల్లే – సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు. పాదయాత్రలో లోకేశ్ ప్రజల సమస్యలను అధ్యయనం చేశారని చంద్రబాబు అన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ జగన్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర వైసీపీ కబ్జాలో నలిగిపోయిందన్నారు..

“ఏపీ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయి… వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంలా మారుతుంది. జగన్ రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాని వ్యక్తి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. టీడీపీ-జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.

“మీరొక అడుగు ముందుకు వేయండి… మేం వంద అడుగులు ముందుకు వేస్తాం… మీరొక త్యాగం చేయండి… మేం వంద త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం” అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అలా కాకుండా… మీరు చేసుకోండి, మాకేంటి సంబంధం అనుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, భావితరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు..

వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, అందులో వైసీపీ ఓటమిపాలవడం ఖాయమని అన్నారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తామని… అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ-జనసేన పొత్తును ముందుకు తీసుకెళతామని, భవిష్యత్ కార్యక్రమాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తామని చంద్రబాబు హామీఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement