Saturday, May 4, 2024

కాంగ్రెస్ నుంచి కమలానికి..

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : అందరూ అనుకున్న విధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తండ్రి నల్లారి అమరనాథ్ రెడ్డి మరణానంతరం వాయల్పాడు నియోజకవర్గానికి 1988లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తల్లి తరపున ప్రచారం చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా 1989లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నల్లారి కిరణ్ గెలుపొందారు. తరువాత 1994లో ఓడిపోయి 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో వాయల్పాడు నుంచి, 2009 లో పీలేరు నుంచి శాసనసభకు ఎన్నికయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత వర్గీయుడుగా పేరొందిన కిరణ్ పార్టీ చీఫ్ విప్ గా, అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు.

వైఎస్సార్ మరణానంతర పరిణామాల నడుమ 2010- 2014 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైఖ్యాంధ్ర పార్టీని పెట్టి 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీచేసినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ గత ఏడాది తిరిగి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీలో చేరినా కార్యక్రమాలకు దూరంగా ఉన్న కిరణ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. అప్పుడే ఆయన బీజేపీ లో చేరనున్నారని ప్రచారం ఊపందుకుంది. అనుకున్న విధంగానే శుక్రవారం నల్లారి కిరణ్ ఢిల్లీలో బీజేపీలో చేరిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఆయన చూపించే ప్రభావం ఆధారంగానే కిరణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement