Monday, April 29, 2024

తాగునీటి సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి పేర్నినాని

మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిదిగా తన ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంపుల చెరువు హెడ్ వాటర్ వర్క్స్ నుండి శారదానగర్ లోని ఓవర్ హెడ్ ట్యాంక్  వరకు 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో  రెండున్నర కిలోమీటర్ల దూరం కొనసాగే తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి పేర్ని నాని గురువారం భూమిపూజ నిర్వహించి శంఖుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ,  స్థానిక శారదానగర్ ప్రాంతంలో మునిసిపల్ ట్యాంకర్ తో నీళ్లు సరఫరా మినహా కుళాయి ద్వారా నీళ్లు లభ్యం అయ్యేవి కావని ఎంతోకాలంగా తాగునీటి ఇక్కట్లు ఆ ప్రాంతంలో అత్యధికమని అన్నారు.  ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే  ఓవర్ హెడ్ ట్యాంక్ శారదానగర్ లో మంజూరైందని పంపుల చెరువు నుంచి నాటి పైప్ లైన్  పాతది కావడం , వ్యాసార్థం చిన్నగా ఉండటం  శారదానగర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ను తాగునీటితో నింపేందుకు అత్యధిక సమయం పడుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 45 కోట్ల రూపాయల తాగునీటి పథకంలో భాగంగా టైలర్స్ కాలనీ, ఖాలేఖాన్ పేటలలో నూతన ఓవర్ హెడ్ రిజర్వాయర్లు త్వరలో నిర్మాణం కానున్నాయని వాటిని సైతం నీటితో నింపడానికి, శారదా నగర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ను వేగంగా నింపడానికి ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం అత్యవసరమన్నారు. గత కొంతకాలంగా శారదానగర్, టైలర్స్ కాలనీ, ఖాలేఖాన్ పేట, శివగంగ ప్రాంత ప్రజలు పడుతున్న తాగునీటి ఇబ్బంది తొలిగిపోనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement