Monday, April 29, 2024

మ‌ధ్య త‌ర‌గతి స్వ‌యంకృతం – ఆరోగ్య శ్రీ కి దూరం

కోవిడ్‌ వేళ రాజస్తాన్‌ బాటే ఆదర్శం
కుటుంబాలన్నిటికీ చిరంజీవ పథకం
బీమా సంస్థలతో ఒప్పందాలైతేనే మేలు
ఇటు రోగులకు.. అటు ఆస్పత్రులకు సంతృప్తి

అమరావతి, – ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతు న్నాయి. అలాగే వైద్యం నిమిత్తం ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్తో పాటు పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులన్నీ కోవిడ్‌ రోగులకు వైద్యాన్నందిస్తున్నాయి. అయితే ఇందు కోసం అవి భారీగా చార్జీలు వసూలు చేస్తున్నా యన్న ఆరోపణలున్నాయి. కొన్ని ఆసుపత్రులైతే ముందస్తుగా లక్షలకు లక్షలు చెల్లిస్తే తప్ప మంచాలివ్వని పరిస్థితుంది. పడకలిచ్చినా ఆక్సిజన్‌ లేదా వెంటిలేటర్లను అందించేందుకు మరికొంత అదనంగా ముట్టజెప్పాల్సొస్తోంది. ఇది కాక మందులు, వైద్య ఖర్చుల పేరిట మరింతగా రోగుల్నుంచి పిండేస్తున్నాయి. దీంతో మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురౌతున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం క్రింద ప్రభుత్వం తెచ్చిం ది. ఇది పేదవర్గాలకు కాస్త మేలైంది. వీరంతా ఆరోగ్యశ్రీ కార్డుల్ని కలిగున్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్నవారికి మాత్రమే ఈ కార్డులు పరి మితం. గతకొన్నేళ్ళుగా మధ్యతరగతి జీవన విధా నంలో అనేక మార్పులొచ్చాయి. ఆధునిక వసతుల ఏర్పాటుకు ఆకర్షణ పెరిగింది. ఇందుకోసం బ్యాంకులు కూడా ఉదారంగా రుణాలిస్తున్నాయి. అయితే బ్యాంక్‌ రుణాల దరఖాస్తుల నిమిత్తం ఖచ్చితంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులై ఉండాలి. ఇల్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనుగోలు నిమిత్తం బ్యాంకుల రుణాల కోసం నిజంగా ఆదాయం ఉన్నా లేక పోయినా మధ్యతరగతి కుటుంబీకులు ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం ప్రారంభించారు. అలాగే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ద్విచక్రవాహనం కనీస అవసరంగా మారింది. కేవలం ఐదారువేలు చెల్లించినా వాయిదాల పద్దతిలో కంపెనీలు ద్విచక్ర వాహనాల్నిచ్చేస్తున్నాయి. కాగా ద్విచక్ర మోటారు వాహనాలున్నా ఐటి రిటర్న్‌లు దాఖలు చేసినా వార్ని దారిద్య్రరేఖ పరిధి నుంచి ప్రభుత్వం తప్పించేసింది. పైగా ఇప్పుడు వాహనాలు కొన్నా లేక ఐటి రిటర్న్‌లు దాఖలు చేసినా ప్ర తీది ఆధార్‌తో అనుసంధానమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆధార్‌ కార్డు సహాయంతో ప్రభుత్వాలు గతకొన్నేళ్ళుగా వరుసగా ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చేశాయి. సొంతిల్లు లేని కుటుంబాలు, మోటారు వాహనాల్ని తమ పేరిట కొనుగోలు చేయని వారికి మాత్రమే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. అలాగని ఐటి రిటర్న్‌లు దాఖలు చేసే కుటుంబాలన్నీ ఆర్ధికంగా ఉన్నత స్థితిలో లేవు. కానీ వార్ని ఆరోగ్య శ్రీ పథకంలో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదు. ప్రస్తుత కోవిడ్‌ సమయంలో పేదవర్గాలు ఆరోగ్యశ్రీతో వైద్యం పొందగలుగుతున్నాయి. ఉన్నత వర్గాలు తమకున్న ఆర్ధికసంపత్తితో వైద్యం చేయించుకుంటున్నాయి. కానీ రాష్ట్ర ంలో అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వర్గాలు మధ్యస్తంగా నలిగిపోతున్నాయి. వీరి వద్ద వైద్యానికి తగిన ఆదాయ వనరులుండవు. అలాగని ఆరోగ్యశ్రీ కార్డులకు వీరు అర్హులుకాదు. కానీ రోగం కబ ళించడంలో వీరికి ఎలాంటి వెసులుబాట్లులేవు. ఈ వర్గాలు ఆసుపత్రులకు లక్షలుచెల్లించలేక ఇంట్లోనే దేవుడిపై భారం వేస్తూ గడిపేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని కుటుంబాలన్నింటిని కోవిడ్‌ వైద్యం వరకు ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి. కేవలం ఉన్నత వర్గాల్ని మినహాయించి వార్నుంచి ఆసుపత్రులు ఫీజుల్ని వసూలు చేసుకునేలా నిబంధనలు మార్చాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజస్థాన్‌ను అనుసరించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న కుటుంబాలన్నింటిని చిరంజీవ పథకంలోకి తీసుకొచ్చింది. ఈ పథకం క్రింద కోవిడ్‌ వైద్య సేవలన్నింటిని బీమా పథకంలో చేర్చింది. ఈ బీమా పథకంలో ఆసుపత్రుల సేవలకు నిర్ధిష్ట రుసుంలను నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి గరిష్టంగా ఐదులక్షల వరకు ఆసుపత్రులకు చెల్లించే విధంగా ప్రభుత్వం ఈ బీమా సంస్థల్తో ఒప్పందాలు చేసుకుంది. దీంతో ఇప్పుడు రాజస్థాన్‌లో ఇటు ప్రజలు, అటు ఆసుపత్రుల నిర్వాహకులు కూడా సంతృప్తితో ఉన్నారు. కోవిడ్‌ వైద్యానికి వారు నేరుగా ఆసుపత్రుల్ని ఆశ్రయించగలుగుతున్నారు. రోగులు తమ డిమాండ్‌ మేరకు బిల్లులు చెల్లించగలరా లేదా అన్న సందేహాలు ఇప్పుడక్కడ ఆసుపత్రులకు లేవు. వైద్యం చేస్తే బిల్లుల్ని బీమా సంస్థలు చెల్లిస్తాయన్న ధీమా ఉంది. అది కూడా గరిష్టంగా ఐదులక్షలవరకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తే పేదల్తో పాటు మధ్యతరగతి వర్గాలు కూడా కోవిడ్‌ వైద్యం పొందే వెసులుబాటుంటుంది. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ క్రింద ప్రభుత్వం నేరుగా చెల్లిస్తున్న బిల్లుల పట్ల ఆసుపత్రుల వర్గాలు సంతృప్తిగా లేవు. ఇది తమ సేవలకు సరిపోవని వారు భావిస్తున్నారు. ప్రభుత్వం నేరుగా చెల్లింపులు జరపడం కంటే నాలుగైదు బీమా సంస్థల్తో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రతి రోగిపై గరిష్టంగా ఐదులక్షల వరకు చెల్లింపులు జరిపేలా నిబంధనలు మారిస్తే కోవిడ్‌ వైద్యం పట్ల ఆసుపత్రివర్గాల్లో కూడా సంతృప్తి ఉంటుంది. దీంతో ఇటు రోగులు, అటు ఆసుపత్రులు రెండువర్గాల్ని ఈ విపత్కాల సమయంలో ప్రభుత్వం ఆదుకున్నట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

60శాతం మందికి ఆరోగ్యశ్రీ చికిత్సలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి పొందిన అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరోనా చికిత్సలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వర్తింప చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ వెల్లడించారు. 60 శాతం మంది ఆరోగ్య శ్రీ కింద కరోనా వైద్య సేవలు పొందుతున్నారని రానున్న వారం రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎంతమందికైనా ఆరోగ్య శ్రీ ద్వారా నగదు రహితంగా చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గత ఏడాది కరోనా నేపథ్యంలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లగా 2,524 మందిని నియమించగా.. ఈ ఏడాది 3,025 మందిని తీసుకోవడం జరిగింద న్నారు. అదే విధంగా 5 వేల 225 మంది స్టాఫ్‌ నర్సులను గత ఏడాది నియమించగా.. ప్రస్తుతం 5 వేల 493 మందిని రిక్రూట్‌ చేసుకున్నట్లు వెల్లడించారు. మరో 2 వేల 472 మంది స్వీపర్లను నియమించామన్నారు. అవసరమైతే మరింత మంది వైద్య సిబ్బందిని నియమించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చినట్లు సింఘాల్‌ తెలిపారు. కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా వైద్య విద్యార్థులు సేవలను కూడా వినియోగించుకోనున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే వీరంతా విధుల్లోకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సామర్ధ్యం పూర్తిగా నిండిన చోట జర్మన్‌ హ్యాంగర్లతో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేస్తున్నామని ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం 599 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి కేటాయించిందని సింఘాల్‌ చెప్పారు. అలాగే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement