Sunday, May 12, 2024

శ్రీశైలంలో కన్నులపండువగా రథోత్సవం.. తెప్పోత్సవం పై ఊరేగిన స్వామి, అమ్మవార్లు.

శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన బుధవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం గంగాధర మండపం వద్ద 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించి రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగబలిలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అన్నం రాశిగా పోసి కుంబం సాత్విక బలి సమర్పించిన అనంతరం రథంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి రథోత్సవం జరిపించారు. ఆలయ ప్రధాన వీధిలో జరిగిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి తమ ఇష్టదైవాలైనా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవం దర్శించుకోవడం వలన సర్వపాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది. అంతకుముందు స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి . యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజా నిర్వహించగా, . లోక కల్యాణం కోసం జపాలు , పారాయణలు చేయబడ్డాయి . అనంతరం మండపారాధనలు , పంచావరణార్చనలు , శివపంచాక్షరి ,నిత్యహవనాలు , రుద్రహోమం , చండీహోమం , కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించారు. ఇక సాయంకాలం ప్రదోషకాల పూజలు , జపానుష్ఠానాలు , రుద్రపారాయణలు , హోమాలు చేశారు. ఆ తర్వాత సాయంకాలం స్వామిఅమ్మవార్ల రథోత్సవం నిర్వహించడం గమనార్హం .

తెప్పోత్సవం..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి 8 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం .
ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు నిర్వహించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను ఆలయరాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపైకి చేర్చి విశేష పూజలు అందించారు. తరువాత మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతోశాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు . కాగా వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో , విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది . తెప్ప అలంకరణకు గాను ఎరుపుబంతి , పసుపు బంతి , తెల్లచేమంతి , ఆస్టర్ , జబ్రా , గ్లాడియోలస్ , ఆర్కిడ్స్ , మొదలైన పుష్పాలను వినియోగించడం జరిగింది . తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది . శత్రుబాధలు తొలగిపోతాయి . కోర్కెలు నెరవేరుతాయి . ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం.

విద్యుద్దీప కాంతులనడుమ పుష్కరిణిలో తెప్పపై విహరించిన ఆది దంపతులను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ రాజగోపురం నుండి పుష్కరిణికి చేరుకున్న స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార క్రతువులు నిర్వహించి పుష్కరిణిలో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు.
కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, ఈఈ మురళీ, అసిస్టెంట్‌ నటరాజ్‌, ఏఈవోలు ఫణీదర్‌ ప్రసాద్‌, పిఆర్‌వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్‌కుమార్‌, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్‌ అయ్యన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement