Sunday, April 28, 2024

ఉక్రెయిన్‌లో ఇంకా 20 వేల మంది.. భారతీయులందరినీ వెనక్కి తీసుకొస్తాం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మరుభూమిలో చిక్కుకున్న మన దేశానికి చెందిన చివరి పౌరుణ్నీ సురక్షితంగా మాతృభూమికి తీసుకొచ్చే వరకు ఆపరేషన్ గంగ కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆయన స్వాగతం పలికారు. మీ భద్రత మాదంటూ విమానంలోకి వెళ్లి వారికి భరోసానిచ్చారు. అనంతరం కిషన్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల్ని ప్రభుత్వం ముందే అప్రమత్తం చేసిందని చెప్పారు. ఆపరేషన్ గంగ ద్వారా ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటివరకు 15 ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 4 వేల మంది మాత్రమే భారతీయులను తిరిగి మన దేశానికి తీసుకు రాగలిగామని, ఇంకా 20 వేల మంది అక్కడే ఉండిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగ మొదలుపెట్టినా ఘర్షణ వాతావరణం తీవ్రతరం కావడంతో విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 75 మంది, తెలంగాణకు సంబంధించిన 97 మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారని ఆయన అన్నారు. అక్కడి ఎంబసీలలో పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండడంతో సహాయ చర్యలకు మరింత ఎక్కువ మంది అవసరమని ప్రధాని భావించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అందుకే కేంద్ర మంత్రులు వీకే సింగ్ (పోలాండ్), జ్యోతిరాదిత్య సింధియా ( రొమేనియా, మాల్డోవా ), కిరణ్ రిజిజు (స్లోవేకియా రిపబ్లిక్), హర్దీప్ పురి సింగ్ ( హంగేరీ )లను వివిధ దేశాలకు పంపినట్టు తెలిపారు. వైమానిక దళానికి చెందిన విమానాలు కూడా అక్కడికి పంపి భారతీయులను తీసుకొస్తున్నామని అన్నారు. పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ పలుమార్లు మాట్లాడారని, భారతీయులకు సేఫ్ పాసేజ్ ఇవ్వాలని కోరారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

దురదృష్టవశాత్తు భారత విద్యార్థి నవీన్ చనిపోవడంపై భారత్ రష్యాతో తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆరు గంటల పాటు సేఫ్ పాసేజ్ ఇచ్చారని, ఈ ఆరు గంటల్లో ఎలాంటి దాడులు చేపట్టకుండా ఉంటామని రష్యా చెప్పినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. భారతీయులందరినీ ముందుగా ఖార్కీవ్ వీడి రావాలని అప్రమత్తం చేశామని, తరలింపు ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని ఆయన చెప్పారు. పుతిన్‌తో చర్చల కారణంగా భారత పతాకం చేతబట్టి వచ్చే ఎవరి మీదా దాడి జరపబోమని రష్యా, ఉక్రెయిన్ చెప్పాయని అన్నారు. పాకిస్తాన్‌తో పాటు ఇతర దేశాల విద్యార్థులు సైతం భారత పతాకం పట్టుకుని బోర్డర్ చేరుకుంటున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ కూడా పూర్తిగా సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ విమానాల్లో సహాయ సామగ్రిని పంపిస్తున్నామని, భారత విద్యార్థుల కోసం చలికి తట్టుకునే దుస్తులు, ఆహార పదార్ధాలు తరలించామని, ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని ఆయన వివరించారు. తన కార్యాలయాల్లో తెలుగు విద్యార్థుల సహాయ కార్యక్రమాల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పుకొచ్చారు. 24 గంటల పాటు టాస్క్ ఫోర్స్, హెల్ప్ లైన్స్ పని చేస్తాయని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ స్నేహితులు, బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అధికారులకు వారి సమాచారాన్ని అందివ్వవలసినదిగా కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అక్కడ ఉన్న మన విద్యార్థులు, పౌరులను రక్షించడానికి, త్వరితగతిన స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి వీలవుతుందని స్పష్టం చేశారు.

భారత ప్రధాని అనుసరించిన విదేశాంగ విధానం, అన్ని దేశాలతో సత్సంబంధాల కారణంగా ఇంత పెద్ద ఆపరేషన్ చేపట్టగలిగామని హర్షం వ్యక్తం చేశారు. ఒక్క పాకిస్తాన్ తో శత్రుత్వం, ఈ మధ్య చైనా మన భూభాగాన్ని అక్రమించాలన్న ప్రయత్నం మినహా అన్ని దేశాలతో మనకు సత్సంబంధాలున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement