Wednesday, May 15, 2024

కర్నూల్ ను సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతాం : ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

కర్నూలు : నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఆధునిక అధిక నాణ్యత కలిగిన పర్సనల్ కిట్స్ (కౌ బాయ్ టోపి, చలువ అద్దాలు, విశ్రాంతి చైర్ )లను కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అంద‌జేశారు. మంగళవారం ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నగరంలోని కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హాజరై మాట్లాడారు. కర్నూలు పట్టణాన్ని సురక్షితమైన నగరంగా తీర్చుదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణంలో సీసీ కెమెరాలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సహాకారం కూడా తీసుకుంటామన్నారు. మహానగరాల్లో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులను స్టడీ చేసి వారితో పాటుగా కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆధునిక అధిక నాణ్యత కలిగిన పోలీసు కిట్స్ ను అందజేశామన్నారు.

64 మంది నుండి 120 మంది వరకు కర్నూలు ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పెంచడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 34 ముఖ్యమైన ట్రాఫిక్ పాయింట్లు, ముఖ్యమైన జంక్షన్ లలో హై పవర్ లౌడ్ స్పీకర్లును ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ తో పాటు , ట్రాఫిక్ పై అవగాహన కల్పించేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. బ్లాక్ స్పాట్స్ ను కూడా గుర్తించామన్నారు. కర్నూలు పట్టణం, శివారు ప్రాంతాలలో అభద్రతా భావం ఉండే ప్రాంతాలలో పోలీసు పెట్రోలింగ్ ను పెంచుతామన్నారు. క్రైమ్ హాట్ స్పాట్స్ పెట్రోలింగ్ ను కూడా పెంచుతామన్నారు. ప్రజల సంరక్షణ కు , మంచి సేవలందించే విధంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీలు యుగంధర్ బాబు, కె వి మహేష్, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement