Thursday, May 9, 2024

KNL: శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ప్రారంభం

భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లు కొలువై ఉన్న శ్రీశైలంలో ఆదివారం దసరా మహోత్సవములు ఉదయం ప్రారంభమయ్యాయి. పదిరోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు 24తేదీతో ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు శ్రీశ అమ్మవారికి నవదుర్గ అలంకరణలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు. చండీహోమం, రుద్రహోమం, జపములు, పారాయణలు జరుపబడుతున్నాయి. ఆలయ ప్రవేశం కల్పిస్తారు. ఇక ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, ఎం.విజయలక్ష్మి, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ.మధుసూదన్రెడ్డి, డా.సి.కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులుగా తన్నీరు ధర్మరాజు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు ఉదయం ఆలయ ప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేయడం జరిగింది. కార్యక్రమgలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు స్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ ఉత్సవాలకు నాందిగా ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయమండపంలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, దీక్షాసంకల్పం, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి యాగశాలలో అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపా రాధనలు, చండీకలశ స్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహజపాలు, చతుర్వేద పారాయణలు, చండీ సప్తశతి, మహావిద్యా పారాయణలు, సూర్యనమస్కారాలు జరిగాయి. అదేవిధంగా స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

ఉత్సవ సంకల్పం :

- Advertisement -

లోకకల్యాణం కోసం నిర్వహించబడే ఈ ఉత్సవ సంకల్పంలో అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండి, సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పేర్కొనబడింది.

గణపతి పూజ :

సంకల్ప పఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను నిర్వహించడం విశేషం.

కంకణ ధారణ :

గణపతి పూజ తరువాత కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించబడ్డాయి. అనంతరం కంకణధారణ జరిపించడం విశేషం. తరువాత ఋత్విగ్వరణం నిర్వహించబడింది. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యాలను నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.

యాగశాలలో కార్యక్రమాలు :

తరువాత అమ్మవారి యాగశాలలో పుణ్యాహవాచనం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన జరిపించబడ్డాయి. అదేవిధంగా ఉత్సవాలలో భాగంగానే అమ్మవారికి నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు
జరిపించారు.

స్వామివారి యాగశాలలో కార్యక్రమాలు :

ఉత్సవాలలో భాగంగానే ఈ ఉదయం శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వర ఋత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, రుద్రకలశస్థాపన,
జరిపించబడ్డాయి.

రుద్రహోమం చండీహోమం :

ఉత్సవాలలో భాగంగానే ప్రతీరోజు లోక కల్యాణార్థం రుద్రహోమం, చండీహోమం
కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

పూజ..

దసరా మహోత్సవాల్లో భాగంగా కుమారి పూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతుంది. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.

పారాయణ..

ఉత్సవాలను పురస్కరించుకుని లోకకల్యణం కోసం చతుర్వేద పారాయణలు, నవగ్రహజపాలు, చండీ సప్తశతి పారాయణ, మహావిద్యాపారాయణ, సూర్యనమస్కారాలు జరిపించబడుతున్నాయి.

శ్రీశైలఖండ పారాయణ :

ఈ ఉత్సవాలలో స్కాంద పురాణంలోని శ్రీశైలఖండ జరిపిస్తారు. వీటితో పాటు పారాయణలు
కూడా దేవస్థానం చేపట్టిన శ్రీశైలఖండ ప్రచురణలో మూలప్రతిని పరిష్కరించి సంస్కృతంలో మూల గ్రంథమును, తెలుగులో శ్లోకభావార్థములను రూపొందించడంలో ముఖ్యపాత్రను పోషించిన శ్రీశ్రిష్టిలక్ష్మీ సీతారామాంజనేయశర్మ, భీమవరం వారిచే ఈ శ్రీశైలఖండ పారాయణ జరిపించబడుతోంది.

సాయంకాల కార్యక్రమాలు:

ఉత్సవాలలో భాగంగా ఈ సాయంకాలం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలు జరిపించబడుతాయి.

శైలపుత్రి అలంకారం..

ఈ నవరాత్రి మహోత్సవాల్లో చేయబడుతున్న నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరింపజేయడం జరుగుతుంది. ద్విభుజాలను కలిగిన ఈదేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ దేవీ ఆరాధన వలన కోరికలు సిద్ధిస్తాయని, ముత్తైదువులకు ఐదవతనం వృద్ధి చెందుతుందని బావిస్తారు.

భృంగివాహనసేవ..

ఇక ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా నేటి సాయంత్రం భృంగివాహనసేవ జరిపిస్తారు.ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగివాహనంపై ఊరేగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement