Wednesday, May 8, 2024

ఏపీలో దారుణం… యువకుడిని కొట్టి చంపిన ఏపీ డీజీపీ గన్‌మెన్

వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థాలకు దారి తీస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని పట్టుకుని కొట్టి చంపిన కేసులో ఏపీ డీజీపీ గన్‌మెన్ అరెస్ట్ కావడం సంచలనమైంది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయవాడ పటమట పీఎప్ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లోని పుట్ట రోడ్డులో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్న శివనాగరాజు కానిస్టేబుల్. విజయవాడ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వులో పనిచేస్తున్న అతడు డీజీపీకి వ్యక్తిగత అంగరక్షకుడిగా ఉన్నాడు.

కానిస్టేబుల్ నివసిస్తున్న అద్దె ఇంటిపైని పెంట్‌హౌస్‌లో ఉంటున్న మచిలీపట్టణానికి చెందిన వెంకటేష్ (24)కు కానిస్టేబుల్ భార్యతో పరిచయమైంది. అది మరింత పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన కానిస్టేబుల్ భార్యను మందలించి హెచ్చరించాడు. ఇంటి యజమానితో చెప్పి వెంకటేష్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు. అయితే వెంకటేష్ ఇల్లు ఖాళీ చేసినప్పటికీ కానిస్టేబుల్ లేని సమయంలో ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, పెద్దలు రాజీ కుదర్చడంతో ఈ ఏడాది జూన్‌లో తిరిగి భర్త దగ్గరకు చేరింది. ఇంత జరిగినా వెంకటేష్‌తో మాట్లాడడాన్ని ఆమె మానుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కానిస్టేబుల్ నైట్ డ్యూటీకి వెళ్లిపోగా, అదే రోజు విజయవాడ వచ్చిన వెంకటేష్ అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత గోడ దూకి కానిస్టేబుల్ ఇంట్లోకి ప్రవేశించాడు.

ఆ సమయంలో అలికిడి కావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమానులు పైకి వెళ్లారు. వారిని గమనించిన వెంకటేశ్ ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. వారు తలుపు తట్టినా తీయకపోవడంతో బయట నుంచి గడియపెట్టి విషయాన్ని శివనాగరాజుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న శివనాగరాజు.. వెంకటేశ్‌ను పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టాడు. దీంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కానిస్టేబుల్ శివనాగరాజు సహా ఇంటి యజమానులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: అయోధ్య రాముడికి అపురూపమైన కానుక

Advertisement

తాజా వార్తలు

Advertisement