Tuesday, May 14, 2024

సైనిక వీరుల త్యాగ ఫలం కార్గిల్‌ విజయం : పవన్‌ కల్యాణ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: భారత సైనిక వీరుల త్యాగఫలం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ అని, 1999 జూలై 26న భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి కార్గిల్‌ కొండలపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన చారిత్రాత్మక శుభదినమిదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. భారత సైనికుల ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం అచ్చెరువొందిన రోజు అని తెలిపారు. అయితే ఈ విజయ సాధనలో 527 మంది సైనికులు వీర మరణం పొందడం గుండెలను పిండేసే వాస్తవమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించిన భారత సైనికులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని, వారి ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. భారత సైనిక పాటవాన్ని, సైనికుల పోరాటపటిమను తక్కువగా అంచనా వేసిన పాకిస్థాన్‌ దుర్బుద్ధితో, కుటిల నీతితో మన సరిహద్దులు దాటిందని, తన పారామిలటరీ దళాలను వేర్పాటు వాదుల రూపంలో కార్గిల్‌ ప్రాంతానికి పంపి సుమారుగా 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోని భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న దుర్మార్గపు వేళ మన సేనలు చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

శత్రువులను తరిమివేయడానికి భారత సైనికులు చూపిన తెగువ, పోరాటం గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని, ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణంలో శత్రువులకు ఎదురెళ్లితే ప్రాణాలుపోవడం ఖాయమని తెలిసినా.. దేశం కోసం, కోట్లాది మంది ప్రజల భద్రత కోసం శత్రు మూకలతో పోరాడి మన దేశ భూభాగాన్ని రక్షించిన వారి త్యాగం ఎంత కీర్తించినా, మరెంత పొగిడినా తక్కువేనని ప్రశంసించారు. ఈ విజయ భేరిలో నినదించిన ప్రతి సైనికునికి, వారి కుటుంబాలకు భరత జాతి సర్వదా రుణపడి ఉంటుందని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూనే ఉంటుందని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జైహింద్‌ పలికారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement